విజయవాడ: కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ప్రజా ఉద్యమాలను బలపర్చడం వల్లే సాధ్యమవుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో గల మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన ప్రజారక్షణ భేరీ సభలో ఆయన ప్రసంగించారు.ఈ ప్రజారక్షణ భేరి సభకు సభాధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ... 49 హింసాత్మక సంఘటనలు మహిళలపై ప్రతీరోజూ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. గిరిజన భూములలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆయన మండిపడ్డారు. పాలస్తీనా వారికి వారి దేశాలను ఇవ్వాల్సి ఉండాలన్నారు. అమెరికా జూనియర్ పార్టనర్‌గా ఇండియాను మోడీ తయారు చేశారన్నారు. గవర్నర్‌లు శాసనసభల చట్టాలు తప్పు అనడం సరైనది కాదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారా మోడీని గద్దె దింపాలన్నారు. ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీ నుంచీ బయటపడాలంటే మోడీని గద్దె దించాలన్న ఆయన.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుంచి ఆమెను ఓడించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని మరల తెచ్చారన్నారు. భారత్‌లో ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. హెచ్‌డిఐ, జిడిపిలలో జి 20 దేశాలలో ఇండియా అందరికంటే కింద ఉందని ఆయన వివరించారు.
గతేడాది ప్రభుత్వం పేదలకు 5 కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేశారన్నారు. ఒక వ్యక్తి బతకడానికి కనీసం 10 కిలోల బియ్యం కావల్సి వస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తే మిగిలిన ఐదు కిలోల బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం కిలో బియ్యం రూ.50 వరకు ఉందని వివరించారు. అదే ప్రభుత్వం పది కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తే ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండేదని వివరించారు. కేంద్రప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తేనే తప్ప 80 కోట్ల మంది జనం బతకలేనంత దుస్థితిలో భారత్ ఉందంటే అభివృద్ధిలో ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చన్నారు. స్థానిక పార్టీలకు ఈడీ, సీబీఐ అంటే భయమా.. మోడీ అంటే భయమా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్ళలో ఏపీకి ఏమీ జరగలేదన్నారు. విభజన చట్టంపై రాజ్యసభలో చాలా చర్చలు జరిగాయని.. ఆలోచన లేకుండా విభజన చేస్తున్నారు అని తెలిపారు. రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ఐదేళ్ళు ప్రత్యేక హోదా.. రాజ్యసభలోనే అప్పుడు వెంకయ్య నాయుడు పదేళ్ళ ప్రత్యేక హౌదా అన్నారని.. ఆ హామీలు అన్నీ ఏమైపోయాయన్నారు. ప్రత్యేక హోదాను వెనకేసుకొచ్చిన బీజేపీ మాటతప్పిందని ఆయన మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చే యోజన, 24వేల కోట్లు ఇస్తానని ప్రధాని చేసే హామీలు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టుకు వ్యతిరేకమని ఈ సందర్భంగా చెప్పారు. తప్పుడు చేతుల్లో అమఅతం చేరింది.. దాన్ని ప్రజల కోసం తీసుకురావాలన్నారు. దేశ ప్రజల ఐక్యతకు పెద్ద ప్రమాదం వచ్చిందన్నారు. ఎమర్జెన్సీ కంటే పెద్ద ఎత్తున దారుణమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయన్నారు. ప్రజా ఉద్యమాల వల్లే మోడీ ప్రభుత్వం ప్రకటించిన రైతాంగ వ్యతిరేఖ చట్టాలను వెనక్కు తీసుకోవల్సి వచ్చిందన్నారు. భారతదేశాన్ని కాపాడాలంటే ఇండియా కూటమి బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. మోడీకి వ్యతిరేకం కాదు.. ఆయన చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజలు మోడీ ప్రభుత్వం వైపు ఉన్నారా.. సిపిఎం వైపు ఉన్నారనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.