
అమరావతి: బీసీల ఓట్లు తొలగించి, వారి పథకాల్లో కోత పెట్టేందుకే కులగణన పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వే చేస్తోందని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో బీసీ సమస్యలపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీనులు మళ్లీ బతికి బట్టకట్టాలంటే తెలుగుదేశం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. జగన్ సీఎం అయిన నాటి నుంచీ బడుగు బలహీన వర్గాలపై దమన కాండ జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో దేశమంతా ఓ సారి చూడాలన్నారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఉందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టిన వైసీపీ సిగ్గు లేకుండా సామాజిక సాధికార యాత్ర అంటున్నారని ఆయన విమర్శించారు. బీసీలను ఓట్లు అడిగే నైతిక అర్హతను వైసీపీ నేతలు కోల్పోయారన్నారు. బీసీల దమ్మేంటో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రికి తెలిసొచ్చేలా చేద్దామన్నారు.