Jun 18,2023 06:26

అబ్బబ్బో మన విద్యుత్తూ
లబోదిబో ప్రజ యావత్తూ!
బిల్లులు చూస్తే ఠారెత్తూ
పళ్ళు కొరికి ఇక పిడికిలి ఎత్తూ!

అసలుకన్నా కొసరే ఎక్కువ
అదనపు ఛార్జీలు తడిసి మోపెడు
'ట్రూ అప్‌' లతో వీర రాపిడి
ప్రజలందరికీ నిలువు దోపిడీ!

వినియోగపు ఛార్జీలకు తోడు
విద్యుత్తు సుంకం, డిమాండు చార్జీ
ఇంధన చార్జీ, ఇ.డి, ఇంట్రెస్టు
కస్టమర్‌ చార్జీ, ఇష్టారాజ్యం!

లైటేస్తే అది డిస్కో డాన్సు
ఫాన్‌ ఆనైతే డుర్రు డుర్రు
లో ఓల్టేజి సమస్య తీరదు
కరెంటు కోతల తీరు మారదు!

ఎండలు చూస్తే భగభగ మండే
ముసలి, ముతక మూర్ఛలు పోయే
కొడుకులు ఏ.సి. కొంటానంటే
పింఛను పోతుందంటూ బెంగ!

వ్యవసాయానికి పెట్టే మీటరు
ఉచిత కరెంటుకు మూడే ఎసరు
రైతులకెన్నో బాధల ముసురు
తిండిగింజలకు వచ్చే కొసరు!

ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లంట
నెలనెలా రేట్లు పెరిగేనంట
ముందస్తు రీఛార్జి కార్డులు
అయిపోతే అర్ధరాత్రి భజనలు!

స్మార్ట్‌ మీటర్ల ఖర్చుల మోత
తొమ్మిది, పదేళ్ళు అప్పుల ఖాతా
అద్దెదారులకు అదనపు వాత
పీక్‌ అవర్స్‌లో రేట్ల జాతా!

ఎన్ని పోర్షన్లు ఉన్నాగాని
ఇంటికి ఒకటే మీటరు అంట
స్లాబులు పైకి దూసుకుపోయి
బిల్లులు బాగా వాచిపోవులే!

విద్యుత్తే అన్నిటికీ దిక్కు
అదిలేకుంటే పెద్ద చిక్కు
కార్పోరేట్లకు మహా లాజిక్కు
పాలకులకు అది భలే మేజిక్కు!

నవరత్నాల పేరు చెప్పి
నవనాడులను మూసేస్తున్నరు
ఊపిరాడక ఉక్కిన ప్రజలు
మీ గద్దెకు కరెంటు షాకులెడతరు!!

- చైతన్యప్రసాద్‌
సెల్‌ : 98496 51451