
- పుస్తకావిష్కరణలో వక్తలు
ప్రజాశక్తి - సీతమ్మధార (విశాఖపట్నం) : 'ది మేంగో లేడీ' నవల ఉద్యమాలకు ప్రేరణగా తోడ్పడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హిందూ సబ్ ఎడిటర్ మల్లాజోస్యుల అనుపమ పద్మజ రాసిన 'ది మేంగో లేడీ' ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. తొలుత ఈ పుస్తకాన్ని సోంపేట థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట యోధురాలు జ్యోతి అతిథులతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పూర్వ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ కెఎస్.చలం మాట్లాడుతూ.. 'ది మేంగో లేడీ' పుస్తకంలో ఒక సాధారణ మహిళ ఎదుర్కొన్న సమస్యలనూ, జీవిత అనుభవాలను చెబుతూ అద్భుతంగా 250 పేజీలు రాయడం గొప్ప విషయమన్నారు. నెలసరి అయ్యిందన్న కారణంతో సదరు మహిళ ఊరు నుంచి గెంటివేయబడిన తరువాత అనుభవించిన కష్టాలను రచయిత్రి పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.నళిని మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఒక మహిళకు జీవితంలో ఎదురైన సంఘటనలను ఆధారంగా తీసుకుని రాసిన ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ఏ గ్రామస్తులయితే తనను ఊరు నుంచి గెంటివేశారో, అదే గ్రామస్తులకు తన పేరు మీద ఉన్న ఆస్తులు ఇవ్వడానికి వచ్చి.. ఆ గ్రామస్తుల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ పుస్తకం రూపుదిద్దుకుందని తెలిపారు. రచయిత్రి నుంచి ఇటువంటి మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. సోంపేట థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట యోధురాలు జ్యోతి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అనేక సమస్యలను పుస్తకాల రూపంలోకి తేవాల్సి ఉందన్నారు. 'ది మేంగో లేడీ' పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలని సూచించారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్, సాహితీవేత్తలు అట్టాడ అప్పలనాయుడు, శ్రీనివాసులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వర్తమాన, సామాజిక జీవితపు వాస్తవ చిత్రీకరణలను నవలలో పొందుపరిచారని తెలిపారు. పుస్తక రచయిత్రి అనుపమ పద్మజ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమస్యలను నిత్యం గ్రహిస్తూ పలువురితో మాట్లాడి ఓ మహిళ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకుని పుస్తకాన్ని రచించినట్టు చెప్పారు. కేన్సర్ బారిన పడి చనిపోయిన తన స్నేహితురాలు సంధ్యను స్మరణకు తెచ్చుకున్నారు. ఆమె జయంతిని పురస్కరించుకుని కార్యక్రమానికి ముందు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.