Oct 21,2023 12:48

ఇజ్రాయెల్‌ : తమ వద్ద బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్‌ మిలిటెంట్లు విడుదల చేశారు. మానవతా దృక్పథంతో ఈ ఇద్దరినీ విడుదల చేసినట్లు హమాస్‌ ప్రకటించింది. ఖతార్‌, ఈజిప్టులతో సంప్రదింపుల అనంతరం మానవతా కోణంలో భాగంగా అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను అల్‌ ఖస్సామ్‌ బ్రిగేడ్స్‌ విడుదల చేసినట్లు టెలిగ్రామ్‌లో పోస్టు చేసింది.

మానవతా కారణాల రీత్యా ఖతార్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన తల్లీ కూతుళ్లు జుడిత్‌ తై రానన్‌ (59), నటాలీ శోషనా రానన్‌ను (17) ను వదిలేసినట్లు హమాస్‌ తెలిపింది. హమాస్‌ మరింతమంది బందీలను విడిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ (అక్టోబర్‌) నెల 7వ తేదీన దక్షిణ ఇజ్రాయెల్‌ పై జరిగిన ఉగ్రదాడిలో ఈ ఇద్దరూ బందీలయ్యారు. హమాస్‌ వద్ద  ఇతర బందీలను కూడా వదిలిపెట్టాలని వారితరపు బంధువులు విజ్ఞప్తులు చేస్తున్నారు.

                                        ఇతరులందరినీ విడిపించేందుకు కృషి చేస్తాం : ఇజ్రాయెల్‌, యు.ఎస్‌ అధికారులు

హమాస్‌ నుండి విడుదలైన ఇద్దరు మహిళలను సురక్షితంగా తీసుకురావడంలో సహకరించిన కతార్‌, ఇజ్రాయెల్‌లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కూడా ఖతార్‌లు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న ఇతరులందరినీ విడిపించేందుకు కృషిని కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌, యు.ఎస్‌ అధికారులు హామీ ఇచ్చారు.

                                                   రెండు వారాలపాటు హమాస్‌ చెరలో... తరువాత విడుదల...

హమాస్‌ మిలిటెంట్ల స్థావరం నుంచి విడుదలైన ఇద్దరు మహిళలు ఇజ్రాయెల్‌కు చేరుకున్నట్లు ఒట్టావా ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దు సమీపంలోని నహాల్‌ ఓజ్‌ కిబ్బట్స్‌ నుంచి తల్లి కూతుళ్లను హమాస్‌ బంధించింది. ఆ సమయంలో వారిద్దరూ ఇజ్రాయెల్‌లో హాలీడేస్‌ కోసం వచ్చినట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు హమాస్‌ చెరలో ఉన్న ఇద్దరు అమెరికన్లు విడుదలైన అనంతరం గాజా సరిహద్దులో ఇజ్రాయెల్‌ రాయబారిని కలుసుకున్నారు. అక్కడి నుండి సెంట్రల్‌ ఇజ్రాయెల్లోని సైనిక స్థావరానికి తీసుకెళ్లి వారిద్దరినీ వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

                                                     ఇద్దరు మహిళలతో ఫోన్‌లో మాట్లాడిన బైడెన్‌...

ఇద్దరు అమెరికన్ల విడుదలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్త తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. హమాస్‌ నుండి విడుదలైన తర్వాత ఇద్దరు మహిళలతో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడారు. తల్లీకూతుళ్లు సురక్షితంగా విడుదలపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నటాలీ రానన్‌ చాలా బాగుందని, చాలా సంతోషంగా కనిపిస్తుందని ఇల్లినాయిస్‌లోని ఆమె తండ్రి యురిరానన్‌ అన్నారు. కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.