Oct 24,2023 08:11

ఇజ్రాయెల్‌ : పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ మరో ఇద్దరు బందీలను విడుదల చేసింది. వారిద్దరూ ఇజ్రాయెల్‌కు చెందిన వృద్ధ మహిళలు. ఈజిప్ట్‌-ఖతార్‌ మధ్యవర్తిత్వం తర్వాత మానవతా దృక్పథంతో ఆ ఇద్దరు బందీలను విడుదల చేసినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. హమాస్‌ విడుదల చేసిన ఇద్దరు మహిళలు రఫా సరిహద్దు నుంచి చేరుకున్నట్టు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

మరో 50 మంది బందీలను విడుదల చేసే అవకాశం...
రెండు రోజుల కిందట అమెరికాకు చెందిన జుడిత్‌ తారు రాన్‌, ఆమె కుమార్తె నటాలే షోషన్‌ రాన్‌లను హమాస్‌ విడుదల చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం హమాస్‌ అదుపులో 222 మంది బందీలుగా ఉన్నారని సమాచారం. వీరిలో అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం.. మరో 50 మంది బందీలను హమాస్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే కాల్పుల విరమణపై అమెరికా తన మాట మార్చింది.

కొనసాగుతోన్న ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు....
అటు, ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి 24 గంటల్లో ఏకంగా 300 కొత్త ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్‌ దాడుల్లో 2 వేల మంది చిన్నారులు సహా 5 వేల మంది చనిపోయినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా గాజా స్ట్రిప్‌ను సీజ్‌ చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ యాక్షన్‌ విరమించడం లేదు. కాగా హమాస్‌ చెర నుండి బందీలను విడిపించేందుకు, వారితో చర్చలు జరిపేందుకు గ్రౌండ్‌ యాక్షన్‌ కొంతకాలం విరమించాలని అమెరికా సూచించింది. ఈ చర్య గాజాకు మానవతా సహాయం అందించే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొంది. అలాగే బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా చూసేందుకు ఇజ్రాయెల్‌తో మాట్లాడుతున్నట్లు అమెరికా తెలిపింది.

ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయడమే అమెరికా ప్రథమ ప్రాధాన్యత : వైట్‌ హౌస్‌ అధికారి
హమాస్‌ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయడమే అమెరికా ప్రథమ ప్రాధాన్యత అని వైట్‌హౌస్‌ అధికారి జాన్‌ కిర్బీ తెలిపారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందేలా చూడటం కూడా దీని లక్ష్యమన్నారు. గాజాను విడిచి వెళ్లాలనుకునే అమెరికన్‌ పౌరులతో సహా గాజా నుండి అమాయక ప్రజలను సురక్షితంగా తరలించాలనుకుంటున్నామని అన్నారు.

కాల్పుల విరమణ తీవ్రవాద దాడులను కొనసాగించడానికి సామర్థ్యమిస్తుంది : అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి
కాల్పుల విరమణ హమాస్‌కు విశ్రాంతిని, పునరుద్ధరణ, ఇజ్రాయెల్‌ పై తీవ్రవాద దాడులను కొనసాగించడానికి సిద్ధమయ్యే సామర్థ్యాన్ని ఇస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ విలేకరులతో అన్నారు. అలాగే, చెరలో ఉన్న బందీలందరినీ హమాస్‌ విడుదల చేస్తే.. గాజాపై దాడుల విరమణ గురించి చర్చిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు.