-బెయిల్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల
-స్వాగతర పలికేందుకు తరలచ్చిన టిడిపి శ్రేణులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:'నాపై మీరు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను' అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 52 రోజుల పాటు ఉన్న ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. దీంతో, మంగళవారం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. బెయిల్ మంజూరు కావడంతో ఉదయం నుంచే టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నగరంలోని లోకేష్ క్యాంపు కార్యాలయంతోపాటు జిల్లాలో పలుచోట్ల బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. బెయిల్ నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సెంట్రల్ జైలుకు తరలి వచ్చిన టిడిపి శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసుల ఆంక్షలను దాటుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. టిడిపి జెండాలు చేతబూని చంద్రబాబుకు జేజేలు పలికారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, సినీనటుడు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ, టిడిపి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. సాయంత్రం 4.15 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటికే గేటు వద్ద ఎదురు చూస్తున్న తన కుటుంబ సభ్యులను పలకరించడంతోపాటు మనవడు దేవాన్ష్‌ను అలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన కోసం పూజలు, ప్రార్థనలు చేశారని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ సంఘీభావం తెలిపారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పులను కూడా చేయనివ్వనని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేసి అభిమానం చాటారన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం తనకు మద్దతు తెలపడాన్ని మరువలేనని చెప్పారు. సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలకూ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి అమరావతికి బయలుదేరారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు కెఎస్ జవహర్, పీతల సుజాత, టిడిపి రాష్ట్ర నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాం, వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.