- హైకోర్టులో అదనపు ఎజి వాదన
ప్రజాశక్తి-అమరావతి : స్కిల్ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. స్కిల్ కేంద్రాల ఏర్పాటు పేరుతో నిధులను విడుదల చేయడం వెనుక అవినీతి కుట్ర దాగి ఉందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆ కేంద్రాల ఏర్పాటు వ్యవహారంలో సీమెన్స్ సంస్థ 90 శాతం నిధులను ఖర్చు చేయక ముందే చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కింద రూ.330 కోట్లను విడుదల చేసిందని తెలిపింది. గత ప్రభుత్వంలోనే ఈ స్కాం బట్టబయలు అయ్యిందని చెప్పింది. ఈ కేసులో నాటి సిఎం చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, బెయిల్ ఇవ్వరాదని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. స్కిల్ కేసులో తనకు ప్రధాన బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు గురువారం కొనసాగిస్తామని జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.