ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టు లాంటి విశాఖ ఉక్కు ను నూరు శాతం తెగనమ్మాలని నిర్ణయించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల ఆత్మగౌరవం పైన, ఆర్థిక అస్తిత్వం పైన వేటు వేస్తే దాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న సమైక్య పోరాటంపై నిందాప్రచారాలతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మరింత దారుణమైన పోటు పొడుస్తున్నది. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, వెనకబడిన ప్రాంతాలకు తోడ్పాటుతో సహా విభజిత రాష్ట్రం విషయంలో చేసిన వాగ్దానాలన్నీ వమ్ము చేసి కడుపులో కుమ్మిన బిజెపి నాయకులు ఇప్పుడు ప్రాణార్పణతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా హరించే వినాశకర నిర్ణయం తీసుకోవడం వివక్షకు వికృత ఉదాహరణ. ఈ నిర్ణయంపై ప్రజలలో ఆగ్రహావేదనలు వ్యక్తం కావడం చూసి 'మేమూ వ్యతిరేకమే. మా వాళ్లకు చెబుతామ'ని ఢిల్లీ యాత్రలు చేసి కల్లబొల్లి కబుర్లు చెప్పారు. మొదట ఇది దేశమంతటికీ వర్తించే విధాన నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్, మాజీ మంత్రి సుజనా చౌదరి వంటి వారు బాహాటంగా సమర్థించారు. ఎంఎల్‌సి మాధవ్ వంటి వారు ఫ్యాక్టరీ ఎక్కడకీ పోదని హాస్యాస్పదమైన వాదనలు చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసి మన చేతిలో ఏముందని సరిపెట్టారు. అయితే ఇలాంటి పైపై మాటలతో ప్రజలను మాయజేయలేమని తేలిపోయాక బిజెపి నేతలు ప్లేటు మార్చేశారు. 'గజం మిథ్య పలాయనం మిథ్య' తరహాలో అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పిందని సోము వీర్రాజు, జివిఎల్ వంటి వారు ఎదురుదాడి ప్రారంభించారు. ఇదంతా తమ హిందూత్వను దెబ్బ తీయడానికి రాజకీయ పక్షాలు ఆడుతున్న నాటకమని తిట్టిపోస్తున్నారు. విశాఖ పక్కనే రామతీర్థంలో సంఘటనను ఆసరా చేసుకొని పరుగులు తీసిన బిజెపి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ఆ మంత్రాన్నే ప్రయోగించాలని చూడటం దాని మతతత్వ రాజకీయానికి, వంచనా శిల్పానికి పరాకాష్ట. మాయమాటలన్నీ తోసిపుచ్చుతూ ఆందోళన ఉధృతమవుతుండటంతో అసలు రంగుతో బయిటకొచ్చిన బిజెపి విశాఖ ఉక్కు రక్షణ ఉద్యమంపై విషప్రచారం విద్వేష వ్యాఖ్యలకు దిగింది. పరిరక్షణలో పాలుపంచుకోకపోగా అందుకోసం సాగే పోరాటంపై అసత్యాలతో పెద్ద పత్రమే ప్రచురించారు. ఉక్కు అమ్మకంపై కేంద్రం నిర్ణయమే తీసుకోలేదని చెప్పడంకన్నా అబద్ధం మరొకటి లేదు. ఆ వివరాలు వాణిజ్య పారిశ్రామిక పత్రికలన్నిటిలో వచ్చాయి కూడా. ''ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లో కేంద్రం వాటా వంద శాతం ఉపసంహరణకు విధానపరమైన నిర్ణయం తీసుకుంది. నష్టాలలో నడుస్తున్న ఆ సంస్థ నుంచి వంద శాతం వాటాలను అమ్మేసేందుకు కేంద్రం తీసుకున్న తుది నిర్ణయం వీలు కల్పిస్తుంది. వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయడంతో పాటు యాజమాన్యాన్ని కూడా ప్రైవేటీకరించాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ 'డీపమ్' కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఫిబ్రవరి 3న అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక్కడ ఇంకో విపరీతమేమంటే ఇప్పటి వరకూ పెట్టుబడుల ఉపసంహరణ అన్న పదం వాడుతున్న కేంద్రం ఏకంగా 'వ్యూహాత్మక అమ్మకం' అనే మాటను తాజా బడ్జెట్‌తో ముందుకు తెచ్చింది. శనివారం నాడు ప్రధాని మోడీ ఉత్పత్తి పెంపు అనే ఊకదంపుడు పేరుతో ప్రైవేటీకరణకు రాష్ట్రాలను సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశమే మరింత స్పష్టంగా వారి ఉద్దేశాలను బహిర్గతం చేసింది.
అడుగడుగునా పోరాటమే!
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది మొదటి నినాదమే గాని ఉక్కు ఫ్యాక్టరీ సాధన, స్థాపన, నిర్వాసితుల సమస్యలు, పునరావాసం, ఉత్పత్తి, ఆధునీకరణ...ప్రతి దాని వెనక సుదీర్ఘమైన పోరాట చరిత్ర వుంది. 1978లో తమిళ దర్శకుడు కె.బాలచందర్ తీసిన 'మరో చరిత్ర' విశాఖ ఉక్కు పైలాన్ సాక్షిగానే జరుగుతుంది. 'ఈ ఫ్యాక్టరీ నిజమైనప్పుడు మన ప్రేమ నిజమవుతుంద'ంటాడు హీరో. ఆ చిత్రంలో వారి కథ విషాదాంతమవుతుంది గాని ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం మాత్రం వీరోచితంగా, విజయవంతంగా సాగింది. 1966లో నిరసనలు, దీక్షలు, రాజీనామాలతో ఉక్కు ఉద్యమం మొదలైతే...ఉక్కు ఫ్యాక్టరీ ఒక రూపం తీసుకోవడానికి కనీసం పాతికేళ్లు పట్టింది. 1991లో వి.పి.సింగ్ ప్రధానిగా బ్లాస్ట్‌ఫర్నేస్ ప్రారంభిస్తే 1992లో పి.వి.నరసింహారావు తదుపరి ఘట్టం ఆవిష్కరించారు. ఫ్యాక్టరీ సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరులతో పాటు నిర్మాణంలో కూడా కార్మికులు, నిపుణులు ప్రాణత్యాగాలు చేశారు. దేశంలో ఇతర ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీలతో పోలిస్తే విశాఖకు పెట్టుబడులలోనూ గనుల కేటాయింపులోనూ వివక్ష అందరి కళ్ల ముందే జరిగింది. కార్మిక సంఘాలు కమ్యూనిస్టులు వెంటపడితే తప్ప ఈ విషయంలో ప్రధాన పాలక పార్టీలు చొరవ తీసుకున్నది లేదు. ప్రతినిధి వర్గాలుగా వెళ్లిన సమయంలో కలసి రావడం, ప్రదర్శనగా వెళ్లినపుడు సభలో ప్రస్తావించడం వంటివి జరుగుతూ వచ్చాయి (స్థానికంగా పునరావాసం, ఉద్యోగాల కల్పన వంటి విషయాల్లో మాత్రం కొందరు నేతలు పోరాడేవారు). ఈ పార్టీలన్నిటి ఆర్థిక విధానాలలో, నమూనాలలో పెద్ద తేడా లేదు. విశాఖ ఉక్కు ఒక రూపం తీసుకోవడం దేశంలో సరళీకరణ విధానాలు మొదలవడం ఒకేసారి జరిగింది. వాస్తవానికి వాటికి ఆద్యుడైన అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ఈ ఫ్యాక్టరీ ప్రధాన ఘట్టాన్ని ప్రారంభించడం యాదృచ్ఛికం కాదు. తర్వాత దశల వారీగా జరిగిన ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలకు లెక్కే లేదు. కాని ఎప్పుడూ రాష్ట్రంలో పాలక పార్టీల రాజకీయాలలో అవి ప్రధాన స్థానం ఆక్రమించకపోగా ప్రైవేటీకరణ వ్యూహాలే ప్రధానంగా సాగాయి. ఎన్‌డిఎ, యుపిఎ-1 హయాంలో కొన్ని పరిష్కారాలు జరిగినా అంతకు అనేక రెట్లు వేగంతో ప్రైవేటీకరణ, అమ్మకం వంటి ప్రతిపాదనలు కొనసాగుతూ వచ్చాయి తప్ప సద్దుమణిగింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దానికి ఎసరు పెట్టడం తప్ప ముందుకు తీసుకుపోవడం ఏలికల ఎజెండాలో లేకపోయింది. ఆ వివరాలన్నీ సిపిఎం, సిఐటియు ప్రచురించిన పుస్తకాలలో వివరంగా వున్నాయి.
ఉక్కు రక్షణకే ఉద్యమం
రాష్ట్ర విభజన తర్వాత ఎ.పి కి మిగిలిన ఒకేఒక పారిశ్రామిక కేంద్రం విశాఖ పట్టణమైతే దానికి ప్రాణవాయువు ఉక్కు ఫ్యాక్టరీ. అయినా దాన్ని కాపాడుకోవడం కీలకమనే మెలకువ రాష్ట్ర పాలకులకు లేకపోయింది. ప్రత్యేక హోదాల వంటివి ఇవ్వకున్నా కనీసం దీనినైౖనా పటిష్టపర్చి కాపాడటానికి కేంద్రానికీ మనసు లేకపోయింది. 2014లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కంపెనీ అంతర్గత విలువ కమిటీ విశాఖ ఉక్కు ప్లాంటుకు రూ.4890 కోట్లు అంచనా కట్టింది. వాస్తవానికి 22 వేల ఎకరాల భూములతో కలసి దాని విలువ రెండున్నర లక్షల కోట్లకు పైనే వుంటుంది. అప్పుడే దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం 'పోస్కో' ప్రతినిధులు 2018లో పర్యటించడం, 1700 ఎకరాల భూమి వారికి కేటాయించి అధునాతన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంకై 2019లో అవగాహనా ఒప్పందం ఎంవోయు కుదిరాయి. ఆ సమయంలో వారు ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు కూడా. ఈ కాలమంతటా దేశంలో రాష్ట్రంలో భిన్న పార్టీలు అధికారం చేస్తున్నా ప్రైవేటీకరణ దిశలో అడుగులు ఆగింది లేదు. వారెవరూ వాటిపై పోరాడలేదు సరికదా ప్రజలతో ఆ సమాచారం పంచుకుని చైతన్యపరిచింది కూడా లేదు. ప్రస్తుతానికి వస్తే 2019లో నరేంద్ర మోడీ రెండవ సారి విజయం సాధించాక ప్రైవేటీకరణ జ్వరం బాగా పెరిగింది. నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ఆ ప్రతిపాదనలు లెక్కకు మిక్కుటంగా వున్నాయి. సంస్థలు మాత్రమే గాక కేంద్రం అధీనం లోని భూములను కూడా విలువ కట్టి అస్మదీయులకు కట్టబెట్టే ఆర్థిక నీతి అమలవుతున్నది. ఈ వేటు విశాఖ ఉక్కుపైనా పడింది. వంద శాతం ప్రైవేటీకరణ జాబితాలో చేరింది. ఈ వార్త వచ్చాక కార్మిక సంఘాలు పోరాటం ఉధృతం చేశాయి.
బిజెపి దుర్నీతిపై పోరాటం
విశాఖ ఉక్కు విషయమై పార్టీ ఒక విధానం తీసుకుంటుందనీ, అప్పటి వరకూ ఎవరూ మాట్లాడవద్దని వైసిపి, జగన్ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతిపాదనలతో లేఖ రాశారు. అందులో. ప్రత్యేకంగా గనులు కేటాయించడం, బ్యాంకుల రుణాలను ఈక్విటీగా మార్చడం, వంటి సూచనలు చేశారు. ఏడు వేల ఎకరాల భూమిని అమ్మి ఆ మొత్తం అప్పులకు కట్టొచ్చని కూడా విశాఖ పర్యటన సమయంలో కలిసిన కార్మిక నాయకులకు సూచించారు. 'పోస్కో' ప్రతినిధులు తనను కలిసిన మాట నిజమే గాని వారికి విశాఖ ఉక్కుపై ఆసక్తి లేదని భావనపాడు, కడప, కృష్ణపట్నం వంటి విషయాలు మాట్లాడారని తెలిపారు. ఆ పార్టీ ఎం.పి విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ వంటి వారు పాదయాత్ర చేశారు. తెలుగుదేశం నాయకుడు పల్లా శ్రీనివాస్ ఆరు రోజుల నిరాహారదీక్ష తర్వాత ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆయనను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు కార్మికుల శిబిరాన్ని సందర్శించి ఐక్య పోరాటంలో తాము కలిసిరావడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ విశాఖ ఉక్కుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బిజెపి దాడి చేయడం అందరికీ తీవ్రాగ్రహం కలిగించింది. శుక్రవారం నాడు విశాఖలో కార్మిక సంఘాల ఆధ్వర్యాన జరిగిన గొప్ప సభలో బిజెపి యేతర పార్టీలన్నీ చేతులు కలిపి పోరాటానికి మద్దతు ప్రకటించడంతో బిజెపి దుర్నీతికీ దుష్ప్రచారాలకు గట్టి సమాధానం. ఈ ఐక్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విశాఖ ఉక్కును ప్రైవేటు పాలవకుండా కాపాడుకోవాలని కార్మికలోకం, రాష్ట్ర ప్రజానీకం కృతనిశ్చయంతో వుండటం అభినందనీయం. రాష్ట్రంలో పెద్ద పార్టీలైన వైసిపి, టిడిపి లతో సహా అందరూ రాజకీయ భేదాలకు అతీతంగా రాష్ట్ర మనుగడకు సంబంధించిన ఈ అంశంపై ఉద్యమాన్ని బలోపేతం చేసి బిజెపి కపట నాటకానికి స్వస్తి చెప్పాలి. పదేపదే ఎ.పి పట్ల వివక్షకు, వికృత ప్రచారాలకు పాల్పడుతున్న మోడీ సర్కారుకు మర్చిపోలేని పాఠం నేర్పించాలి. రాష్ట్ర వ్యాపితంగా సాగుతున్న ఈ పోరాటం భవిష్యత్ రాజకీయాలను చాలా ప్రభావితం చేస్తుంది. మతతత్వ రాజకీయాలు ఎ.పి లో చెల్లుబాటు కావని చాటి చెప్పి మనుగడ కోసం నడుం బిగించవలసిన సందర్భం ఇది. రాష్ట్రం కోసం విశాఖ ఉక్కు రక్షణ కోసం మొదలైన ఈ సమిష్టి పోరాటం రేపు మిగిలిన న్యాయమైన హక్కుల సాధనకు బాట వేయాలనేది ప్రజలందరి ఆకాంక్ష.
* తెలకపల్లి రవి










