Apr 30,2021 13:08

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వరంగ పరిరక్షణ కై జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 29వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరం వద్ద మహాకవి శ్రీశ్రీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న సాహితీస్రవంతి అధ్యక్షులు ఎన్‌.రమణాచలం మాట్లాడుతూ... శ్రీ శ్రీ ఒక ప్రజా కవియని అన్నారు. ప్రపంచంలో పీడించే వర్గం పీడింపబడే వర్గం అనే రెండు వర్గాలుగా ఉందని, అందులో ప్రపంచాన్ని నడిపించేది, సంపద సృష్టికి కారణమయ్యేది పీడింపబడే వర్గమేనని, ఆ వర్గం అభ్యున్నతే తన లక్ష్యం అని తన కవితల ద్వారా ఎన్నో ఉద్యమాలకు శ్రీ శ్రీ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఒక కవిగానే కాకుండా, ఎమ్మెల్సీగా కూడా చట్టసభల్లో కార్మిక వర్గం వాణిని వినిపించారని అన్నారు. శ్రీశ్రీ లాంటి మహాకవి, గొప్ప వ్యక్తి విశాఖపట్నంలో జన్మించడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఆయన స్ఫూర్తితోనే ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
   ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి గుర్రం రమణ మాట్లాడుతూ... విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో ఉద్యోగులు కాకపోయినా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకై ఈ రోజు దీక్ష శిబిరంలో నిరాహార దీక్షకు కూర్చున్న క్యాబ్‌ డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్‌ కెఎస్‌వి కుమార్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్న పోరాటమే శ్రీశ్రీ కి సరైన నివాళి అన్నారు. విశాఖపట్నంలో ఉండే అన్ని యూనియన్లు పోరాటంలో భాగస్వాములు అవుతున్నందుకు మన పోరాటం విజయం సాధించే వరకు, మోడిని గద్దె దింపెవరకూ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి.జగన్‌, ప్రజానాట్యమండలి నగర ఉపాధ్యక్షుడు చంటి, కుమారి, క్యాబ్‌ యూనియన్‌ నాయకులు శ్రీరాములు, లక్ష్మీ నారాయణ, శీనువాస్‌, అప్పలరాజు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.