గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కును సంరక్షించుకోవడానికి శుక్రవారం నుంచి కూర్మన్నపాలెం వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీని ఏర్పాటు చేసినట్లు స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం (సిఐటియు) అధ్యక్షులు జె.అయోధ్యరాం తెలిపారు. దీక్షలను ప్రారంభించడానికి ఆనాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల - హక్కు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు హాజరుకానున్నారని చెప్పారు. 18న స్టీల్‌ప్లాంట్ 39వ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్మిక కుటుంబ సభ్యులతో సహా బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీల సహకారం, మద్దతు తీసుకుంటూనే విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యాన మరింత స్వతంత్రంగా ఉద్యమాన్ని నడిపేందుకు గానూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. చైర్మన్లుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, ఐఎన్‌టియుసి నుంచి మంత్రి రాజశేఖర్, ఎఐటియుసి నుంచి డి ఆదినారాయణ, కో కన్వీనర్లుగా గంధం వెంకటరావు, కెఎస్‌ఎన్.రావు, సభ్యులుగా మరో 25 మంది కలిసి మొత్తం 40 మందితో కమిటీ ఏర్పాటైనట్లు వెల్లడించారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం (విజెఎఫ్)లో గురువారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ప్రధాన మంత్రిని కలుస్తాం : విజయసాయి రెడ్డి
''వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్త్తోంది.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు, దేశంలో సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీ, బిఎస్‌పి, లోక్‌సత్తా ఇతర పార్టీల ఎంపీలను ఐక్యం చేసి త్వరలో ప్రధాని నరేంద్రమోడీని కలిసేలాగ అపాయింట్‌మెంట్‌ను తీసుకుని వినతిపత్రం సమర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్‌ను మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ శుక్రవారం తీసుకుని ఉక్కు పరిరక్షణ ఉద్యమ నేతలను త్వరలో తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. గురువారం రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ జె.అయోధ్యారాం, చైర్మన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, తదితరులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. హోం మంత్రిని విశాఖ ట్రేడ్ యూనియన్ నాయకులతో కలుస్తామని చెప్పారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ..ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం సంప్రదించలేదని, పోస్కో కాదు కదా వాడి తాత వచ్చినా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోకి రానివ్వమని పోస్కోను ఒడిశా, చత్తీష్‌గడ్ రాష్ట్రాల్లో తరిమికొట్టినట్లే ఇక్కడా కొడతామన్నారు. సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ.. కేంద్రం నడపలేకపోతే సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్‌ను విలీనం చేయాలని, మైనింగ్ కోసం నాగర్‌లో కలపాలని డిమాండ్‌చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణమూర్తి, పరిరక్షణ కమిటీ చైర్మన్ ఐఎన్‌టియుసి నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడారు.ఉక్కును ప్రైవేటీకరణ భూతం అలముకుందని, అందరం రక్షించాలని కోరారు.