ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):త్యాగాలతో ఏర్పడి రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయాలని చూస్తే సహించేది లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ హెచ్చరించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 995వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ ట్రాఫిక్, ఆర్‌ఎండి, కన్‌స్ట్రక్షన్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. ఒకవైపు జిందాల్ కంపెనీని ఆహ్వానిస్తూనే మరోవైపు స్టీల్‌ప్లాంట్‌లోని విలువైన యంత్రాలను ప్రయివేటు వారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ప్లాంట్‌లో ఉత్పత్తిని తగ్గించారని, కొన్ని విభాగాలను మూసివేసి నష్టాలవైపు నెడుతున్నారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఒకవైపు కార్మికుల ప్రయోజనాలను దెబ్బ తీస్తూ, ఉద్యోగోన్నతులు కల్పించకుండా అనేక అవరోధాలు సృష్టిస్తూ పారిశ్రామిక అనిశ్చితికి పురిగొల్పుతున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి స్పందన లభిస్తోందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్లాంట్‌ను పూర్తిస్థాయి ఉత్పత్తితో నడిపించాలని కోరారు. సొంత గనులు కేటాయించాలని, విస్తరణ కోసం చేసిన అప్పులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు రాజు, ఎస్.ఈశ్వరరావు, పి,అప్పారావు, ఆర్.శ్రీనివాసరావు, అశోక్ పాల్గొన్నారు.