Oct 29,2023 13:57

ప్రజాశక్తి- విశాఖ : బిజెపిని ఓడిస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలమని మాజీ మంత్రి, కిసాన్ సంయుక్త మోర్ఛా రాష్ట్ర కన్వీనర్  వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు.  అల్లూరి విజ్ఞాన కేంద్రంలో స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సిపిఎమ్ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో  వక్తలుగా మాజీ మంత్రి, కిసాన్ సంయుక్త మోర్ఛా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్  ప్రొఫెసర్ కేయస్ చలం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల పూర్వ ఎమ్మెల్సీ శ్రీ ఎంవీఎస్ శర్మ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం జగ్గు నాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్, పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్  కెయం శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. వడ్డే శోభనాద్రీశ్వర్రావు మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ను నూటికి నూరు శాతం అమ్మేయాలన్న నిర్ణయం దుర్మార్గమని ఆయన తెలిపారు. మరికొన్ని సంస్ధలను కూడా స్ట్రాటజిక్ సేల్ చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలు నాలుగు మినహా మిగిలిన వాటిని అమ్మాలనుకోవడం అన్యాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సింగల్ పాయింట్ ఏజెండాతో వెళుతుందని వెల్లడించారు. ఆదానీని ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా  చేయడానికి ప్రయత్నిస్తున్నారని  విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్ధలను ప్లేట్లో పెట్టి కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహించారు. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎలక్షన్ లో మోడీని ఓడించాలని కోరారు. అలాగే బిజెపితో చట్టపట్టలేసుకునే పార్టీలను సాగనంపాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ను బుక్ వ్యాల్యూకు అతి తక్కువ ధరకు కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. టాటా స్టీల్ తో సమానంగా పోటీపడే ఉక్కు మనదని వెల్లడించారు. కానీ బొగ్గు గనులు లేకుండా చేశారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి  అది మోడీ తాతగారి సొమ్ముకాదని ఆగ్రహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని కోరారు. లేదంటే విశాఖపట్నం పోర్టును కూడా ఆదానికి అమ్మేసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు పనికి విశాఖపట్నం ప్రజలు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరని తెలిపారు.