Nov 02,2023 21:40

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):స్టీల్‌ప్లాంట్‌పైనా, కార్మికులపైనా యాజమాన్యం అవలంబిస్తోన్న కుట్రలను ఉద్యమాలతో తిప్పికొడతామని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ అన్నారు. స్టీల్‌ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, పూర్తి స్థాయి ఉత్పత్తితో కర్మాగారం నడిచేలా చూడాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ సిఐటియు, మిత్రపక్షాల ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌ గేటు వద్ద గురువారం ధర్నా జరిగింది. అనంతరం కార్మికులంతా ఇడి కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి అక్కడ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ యాజమాన్యం కావాలనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. జీతాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్యాంకు రుణాలను స్టీల్‌ కార్మికులు సకాలంలో చెల్లించలేక డిఫాల్ట్‌గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ ప్లాంట్‌ను అష్టదిగ్బంధనం చేసి ఏదో విధంగా జిందాల్‌ను ప్లాంట్‌లోకి తీసుకురావాలనే కుట్రలో భాగంగానే విశాఖ ఉక్కుకు నష్టాలు వచ్చేలా చేస్తున్నారన్నారు. స్టీల్‌ సిఎమ్‌డి తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు. సంఘం అధ్యక్షులు వైటి.దాస్‌, మిత్రపక్షాల నాయకులు డివి.రమణారెడ్డి, డి.సురేష్‌ బాబు, సిహెచ్‌.సన్యాసిరావు మాట్లాడుతూ జిందాల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్‌లోకి రానిచ్చేదిలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పి.శ్రీనివాసరాజు, బి.అప్పారావు, గంగాధర్‌, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.