Nov 05,2023 21:05

ప్రజాశక్తి - గాజువాక (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయమై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపాలని, రాష్ట్రంలోని అఖిలపక్ష రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకునేటట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఉక్కు పరిరక్షణ దీక్షలు వెయ్యి రోజులకు చేరుతున్న నేపథ్యంలో కూర్మన్నపాలెంలోని దీక్షా శిబిరం వద్ద ఆదివారం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు అనేక విజ్ఞప్తులు చేశామని, వారి నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు మాత్రం తమ పోరాటానికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిన విషయాన్ని గుర్తుచేశారు. అది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడితోనే సాధ్యమైందని తెలిపారు. ఆ దిశగా జగన్‌మోహన్‌రెడ్డి కూడా చొరవ చూపాలని కోరారు. మరో కో - కన్వీనర్‌ నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వాలపై కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని కోరారు. సమావేశంలో పోరాట కమిటీ కన్వీనర్‌ కెఎస్‌ఎన్‌.రావు, నాయకులు కారు రమణ, యు.రామస్వామి, బడ్డు పైడిరాజు, వరసాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.