Apr 30,2021 08:22
  • హెచ్‌పిసిఎల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పైడిరాజు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖ) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం దారుణమని హెచ్‌పిసిఎల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి.పైడిరాజు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు 28వ రోజుకు చేరాయి. గురువారం చేపట్టిన దీక్షలను పైడిరాజు ప్రారంభించి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, దీన్ని అమ్మే అధికారం మోడీ ప్రభుత్వానికి లేదన్నారు. 32 మంది ప్రాణదానంతో ఏర్పడిన ఉక్కు కర్మాగారాన్ని నష్టాలు వస్తున్నాయనే సాకుతో అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. విశాఖ నగరానికి ప్రభుత్వ రంగ సంస్థలు మణిహారంగా నిలిచాయని, వీటన్నింటి ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ జింక్‌ కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తే అది నేడు పూర్తిగా మూతపడిందన్నారు. అదే పరిస్థితి స్టీల్‌ప్లాంట్‌కు కల్పిస్తారా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.రమణ, వి.అప్పనాయుడు, ఎన్‌.కృష్ణ, ఎన్‌.రమణ, ఎం.కాటంరావు పాల్గొన్నారు.