
- సంఘీభావం తెలిపిన టిడిపి కార్పొరేటర్లు
ప్రజాశక్తి - ఉక్కునగరం : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 78వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని శుక్రవారం టిడిపి కార్పొరేటర్లు సందర్శించి ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. తొలుత శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకుని, చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ళ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. శ్రీశ్రీ తన కవితల ద్వారా సమానత్వం, సమన్యాయం, సామ్యవాదాన్ని అందించడానికి గొంతెత్తా రన్నారు. ప్రస్తుతం పరమ ఛాందస మతతత్వ శక్తుల దాడి తీవ్రమైందన్నారు. శ్రీశ్రీ ఆయన చూపిన బాటలో ఉక్కు కార్మికులు పోరాటం చేయాలన్నారు. 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీను మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్, చైర్మన్ డి.ఆదినారాయణ, కో కన్వీనర్ గంధం వెంకటరావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం రానున్న కాలంలో మరింత ఉధృతం కానుందని తెలిపారు.