విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వ్యూహాత్మక అమ్మకానికి (స్ట్రాటజిక్ సేల్) పెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి మరణ శాసనం వంటిది. దేశంలో అత్యంత అధునాతనమైన, సముద్ర తీరంలో వున్న ఏకైక సమగ్ర ఉక్కు కర్మాగారమిది. అనేక ఆటంకాలను అధిగమించి, ఎన్నో మైలు రాళ్లను దాటుతూ అద్భుత ప్రగతితో యావత్ దేశం గర్వించేలా ఉంది. విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయాక రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వరంగ కర్మాగారమిది. ఈ స్టీల్ ప్లాంట్‌లో 38 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. 22 వేల ఎకరాల భూమితో కలిపి ప్లాంటు విలువ లక్షన్నర కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా. 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో కొన్నాళ్లు కాదు.. కాదు... కొన్నేళ్లపాటు యావత్ తెలుగు ప్రజలూ పోరాడి 32 మంది యువ కిశోరాల బలి దానంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మోడీ ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించడం బరి తెగింపే! కమ్యూనిస్టుల చొరవతో ప్రారంభమైన ఆనాటి ఉద్యమంలో అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు, శక్తులూ పాల్గొన్నాయి. అయితే, బిజెపి పూర్వ రూపం జనసంఫ్‌ుకు ఎలాంటి పాత్ర లేని విషయం గుర్తు చేసుకోవడం అవసరం. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని కేంద్ర మంత్రుల మొదలు బిజెపి స్థానిక నాయకుల వరకూ అందరూ ఇప్పటివరకూ జనానికి చెబుతూ వచ్చారు. ఇప్పుడు గుండుగుత్తగా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పెద్ద మోసం. విభజన హామీల్లో కీలకమైన కడప ఉక్కు ఫ్యాక్టరీకి మొండిచెయ్యి చూపి, ఉన్న ఒక్క ప్రభుత్వరంగ ప్లాంటును సైతం ప్రైవేటుకు తెగనమ్మడానికి పూనుకోవడం ఈ రాష్ట్రానికి బిజెపి చేసిన మరో ద్రోహం.
దేశంలో సొంత గనులు లేని ఏకైక సమగ్ర ఉక్కు కర్మాగారం విశాఖ ప్లాంటే! సొంత గనుల సాధనకు సుదీర్ఘ కాలం ప్రజలు ఉద్యమాలు సాగించినా పాలకులు హామీలిచ్చినట్టే ఇచ్చి ఆ తరువాత ఒట్టి చెయ్యి చూపారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా బయ్యారం గనులు అలాగే వుండగా అనంతపురం జిల్లా ఓబుళాపురం ఇనుప ఖనిజం గాలి జనార్ధనరెడ్డికి అప్పగించారేతప్ప విశాఖ స్టీల్‌ప్లాంటుకు ఏవీ ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వం స్వదేశీ జపం చేస్తూనే దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ 'పోస్కో'కు ఎర్ర తివాచీ పరిచింది. విశాఖ స్టీల్ ప్లాంటు భూముల్ని అప్పగించడానికి ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసి, దానికి ప్లాంటు ఆవరణలోనే కార్యాలయం కూడా కేటాయించింది. ఇప్పుడు ఏకంగా ఆ ప్లాంటునే మింగేసే పరిస్థితి రావడం 'ఒంటె - గుడారం' కథను గుర్తుకు తెస్తోంది. భారత ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి వ్యయం రూ.8,250 కోట్లు కాగా స్టీల్ ప్లాంటు పన్నులు, డివిడెండ్ రూపంలో సర్కారుకు రూ.33,092 కోట్లు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికీ రూ.7,977 కోట్లు పన్నులుగా వచ్చాయి. బంగారు గుడ్లు పెట్టే బాతు గొంతు కోసి కార్పొరేట్లకు విందు చేయనున్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని యావత్ ప్రజానీకం వ్యతిరేకించాలి. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశంపై వైసిపి, టిడిపి తమ వైఖరి వెల్లడించాలి. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి ఆ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజా క్షేత్రం లోనూ అందుకోసం పోరాడే శక్తులతోపాటు నిలవాలి. కాదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ప్రత్యేక హోదాను తిరస్కరించి, రాజధాని నిర్మాణంతో సహా విభజన హామీల అమలును విస్మరించిన బిజెపిని రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. రాష్ట్రానికి అశనిపాతం వంటి ఈ ప్రైవేటీకరణ నిర్ణయంతో ప్రజలు ఆ పార్టీకి పుట్టగతుల్లేకుండా చేయడం ఖాయం.
చరిత్ర పరిశీలిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పుట్టింది, ఉద్యమంతోనే పెరిగింది, ఉద్యమం వలనే బ్రతికింది అన్న విషయం మనకు బోధపడుతుంది. కాబట్టి ఇకముందు కూడా దాన్ని ప్రజా ఉద్యమాలతోనే రక్షించుకోవాలి. కార్మికవర్గం ముందు పీఠిన నిలిచి రాష్ట్రంలోని వివిధ వర్గాలు, తరగతుల ప్రజలను ముఖ్యంగా యువతీయువకులను ఉద్యమం సాగించాలి. 'ప్రభుత్వ రంగంలోనే విశాఖ ఉక్కు' అని ఆంధ్రులంతా గర్జించాలి.










