Oct 22,2023 21:35

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి పోరాటంలో పాల్గనాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 983వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో టిఎన్‌టియుసి అనుబంధ ఉక్కు శ్రామిక సంఘం కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు బడ్డు పైడిరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ని అమ్మాలని చూడడం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే అవుతుందని అన్నారు. విశాఖ ఉక్కు రక్షణపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. కార్మికుల పోరాటం పెద్ద ఎత్తున సాగుతున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం తగదని అన్నారు. నాయకులు ఎం కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ త్యాగాలతో ఏర్పడ్డ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ ప్రదర్శించాలని కోరారు. నేటికీ ఎనిమిది వేల మంది ఉక్కు నిర్వాసితులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని, ప్లాంట్‌లో వారికి శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు కరణం సత్యారావు, బడ్డు రమణ, పెంటారావు, బి చిన్నారెడ్డి, బి కోటేశ్వరరావు, నరేష్‌, తిరుపతిరావు, అప్పలనాయుడు, గంటా తాతబాబు, పేర్ల నూకరాజు, వి సన్యాసిరావు, అప్పారావు పాల్గొన్నారు.