Oct 19,2023 21:39

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ):స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ప్రధాన కర్తవ్యమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ, ఒబిసి అసోసియేషన్‌ అధ్యక్షులు బి అప్పారావు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 980వ రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఒబిసి అసోసియేషన్‌ ప్రతినిధులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి ఆదినారాయణ, అప్పారావు మాట్లాడుతూ, తక్కువ వ్యయంతో దేశ అవసరాలకు కావాల్సిన సరుకులు అందిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను పాలకులు నిర్వీర్యం చేసి ప్రయివేటు వారికి కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని, గౌరవాన్ని పెంచే ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. రిజర్వేషన్ల పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం అన్ని వర్గాలు ఏకమై ప్రభుత్వ రంగాలను కాపాడుకోవాలన్నారు. ప్లాంట్‌లోకి దొడ్డిదారిన రావాలని చూస్తున్న జిందాల్‌ వంటి సంస్థలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒబిసి అసోసియేషన్‌ నాయకులు దొమ్మేటి అప్పారావు, శ్రీనివాసులునాయుడు, కోయిలాడ శ్రీనివాస్‌, పులి రమణారెడ్డి, పి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.