కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు
ప్రజాశక్తి- అనకాపల్లి (అనకాపల్లి జిల్లా) :విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి, ప్లాంట్‌ను పరిరక్షించాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. అనకాపల్లిలోని దొడ్డి రామునాయుడు భవనంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, పిడిఎస్‌ఒ ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.అశోక్ మాట్లాడుతూ.. ఆంధ్రుల పోరాటం ఉలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చిందన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్లను పన్నుల రూపంలో చెల్లించిందన్నారు. రూ.మూడున్నర లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బిజెపి ప్రభుత్వం రూ.30 వేల కోట్లకు తన అనుయాయులకు అమ్మేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఏకైక భారీ పరిశ్రమగా ఉండి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తోన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తానని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు నోరెత్తడంలేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, విద్యావేత్తలు, మేథావులందరూ నవంబర్ 8వ తేదీన జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రమణ, ఎస్.నాగరమణ, సహాయ కార్యదర్శి గీతాకృష్ణ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.శివాజీ, ఎస్‌వి నాయుడు, సహాయ కార్యదర్శి బి.శివ, జిల్లా కమిటీ సభ్యులు జి.సురేష్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్, ఎఐవైఎఫ్ నాయకులు వి.రాజు, పిడిఎస్‌ఒ జిల్లా కార్యదర్శి భాస్కర్ తదితరులు మాట్లాడారు.