Oct 30,2023 10:34

- బిజెపితో అంటకాగే పార్టీలను ఓడించాలి
-'స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థల రక్షణ' రాష్ట్ర సదస్సులో వక్తలు
ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో :పోరాటాలతోనే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడతాయని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి, అదానీని ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలబెట్టడమనే సింగిల్‌ అజెండాతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ విషయమై ప్రజలను చైతన్యవంతం చేసి కార్మికవర్గం పోరాటాలకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకు విశాఖలోని డాబాగార్డెన్స్‌ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథి రాష్ట్ర మాజీ మంత్రి, కిసాన్‌ సంయుక్త మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. ప్రజలు చెల్లించిన పన్నులు, లక్షల మంది శ్రమజీవుల కష్టంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు బిజెపి పాలనలో తీవ్ర ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను 'అమ్మేస్తాం...మూసేస్తాం' అంటూ బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్లాంట్‌ ఏమన్నా మోడీ తాత సొమ్మా అంటూ ప్రశ్నించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోలేకపోతే మున్ముందు పోర్టు, షిప్‌యార్డులను అదానీకి అప్పగించ్చేస్తారని అన్నారు. ప్రయివేటీకరణకు ప్రజా ఆమోదం లేదన్న సంగతి మోడీ గుర్తించాలన్నారు. 2024 ఎన్నికల్లో బిజెపితో లంకె పెట్టుకున్న రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీనైనా ప్రజలు ఓడించాలని, లేదంటే ప్రభుత్వ రంగం ధ్వంసమవుతుందని తెలిపారు. 283 ప్రభుత్వ రంగసంస్థలను అమ్మేసే కుట్రలకు బిజెపి తెగబడిందన్నారు. అదానీని పెద్దోడిని చేసిన ఘనత మోడీకే దక్కుతుందని విమర్శించారు. ద్రవిడ యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి ప్రొఫెసర్‌ కెఎస్‌ చలం మాట్లాడుతూ వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలతో ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడ్డాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలంటేనే ప్రజల ఆర్థిక సంస్థలని నాటి ప్రధాని నెహ్రూ అన్న మాటలను గుర్తుచేశారు. ప్రజల నుంచి వచ్చిన డబ్బుతోనే ఆ సంస్థలను నాడు ఏర్పాటు చేశారన్నారు. దేశాభివృద్ధిలో అవి కీలకపాత్ర పోషించాయన్నారు. బిజెపి అధికారం చేపట్టిన తరువాత కార్మికుల సంఖ్య ఎలా తగ్గుముఖం పట్టిందో వివరించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ డిసిఐ, బిహెచ్‌పివి, షిప్‌యార్డులను కాపాడుకున్న చరిత్ర విశాఖ కార్మికవర్గానికి ఉందన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం 990 రోజులుగా కార్మికులు, ప్రజలు పోరాడుతున్నారని, కచ్చితంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రానికి, విశాఖకు ఇంత ద్రోహం చేస్తుంటే వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మౌనం దాల్చడం తగదన్నారు. ఆ పార్టీలు రాజకీయాలు తప్ప ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజా సమస్యలను అజెండాగా చేసేందుకు నవంబర్‌ 15న సిపిఎం ఆధ్వర్యాన విజయవాడలో తలపెట్టిన ప్రజా రక్షణ భేరి సభను విజయవంతం చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచాలన్నారు. ప్రజల ముంగిటకు కార్మికులు వెళ్లి సరళీకరణ విధానాలు విద్య, వైద్య రంగాలను దెబ్బతీస్తున్న వైనాన్ని చెప్పి వారిని పోరాటాలకు సన్నద్ధం చేయాలన్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో దీన్నే అజెండాగా చేయాలని పిలుపునిచ్చారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం జిల్లా అధ్యక్షులు ఎ బాలాజీ మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాల తోడ్పాటు లేదన్నారు. సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, కెఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.