Feb 10,2021 07:00

   విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని ఎందుకు అమ్మేయాలను కుంటున్నారు? విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలలో ఉన్నందువలనా? లేక ప్రభుత్వం ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకోవటానికా? ప్లాంటు సరిగ్గా పని చేయటంలేదా? ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టింది? తిరిగి ప్రభుత్వానికి ఏమైనా వచ్చిందా? నిజంగా నష్టాలలో ఉందా? నష్టాలలో ఉంటే వాటికి కారణాలు ఏమిటి ?
   విశాఖ స్టీల్‌ప్లాంటు నష్టాలలో లేదు. ప్రతి సంవత్సరం నగదు లెక్కలు తీస్తే లాభాలలోనే వుంది. స్టీల్‌ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతోనూ, బ్యాంకు అప్పుల తోనూ ప్లాంటును విస్తరించారు. 63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. నష్టాలు ఉంటే వాటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. 1971 జనవరి 20న ఇందిరాగాంధీ బాలసముద్రం వద్ద పైలాన్‌ను ప్రారంభించి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ స్ధాపన నిర్ణయాన్ని వెల్లడించారు. ఏడు సంవత్సరాలు డబ్బు కేటాయించలేదు. 1978లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం విశాఖ స్టీల్‌ కు రూ.1000 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. 1979 జూన్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 1982 జనవరిలో మొదటి బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు, టౌన్‌షిప్‌కు శంకుస్ధాపనతో నిర్మాణం ఊపందుకుంది. 1992 ఆగస్టు1న ప్రధాని పి.వి.నరసింహారావు 32 లక్షల టన్నుల సామర్ధ్యంగల విశాఖ స్టీల్‌ను జాతికి అంకితం చేశారు. స్టీల్‌ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం పెట్టుబడులు ఆగిపోయాయి. బ్యాంకుల నుండి అప్పులను తీసుకుని స్టీల్‌ప్లాంటును విస్తరించారు. ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాల బాట లోకి తెచ్చారు. 2002 నుండి 2008 వరకు వరస లాభాలలో వుంది. 2004 లో రూ.2800 కోట్లు, రికార్డు స్ధాయి లాభాలను ఆర్జించింది. ప్లాంట్‌ విస్తరిస్తే, పూర్తి సామర్ధ్యాన్ని వినియోగిస్తే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని 2006లో ప్లాంట్‌ విస్తరణకు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంకుస్ధాపన చేశారు. 32 లక్షల టన్నుల నుండి 63 లక్షల టన్నులకు ఉత్పత్తిని పెంచటానికి ప్రయత్నాన్ని ప్రారంభించి సాధించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సామర్ధ్యాన్ని గుర్తించి ''నవరత్న''గా గుర్తించారు. గుర్తింపు పొందిన సంవత్సరంలోనే ప్లాంట్‌ 10 శాతం అమ్మకానికి పెట్టారు (2011 జనవరి).
  కార్మికుల, ప్రజల ఆందోళన తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. వాటాల ఉపసంహరణను ఆపేశామని కేంద్రం ప్రకటించింది. మరల 2014 సెప్టెంబర్‌లో ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం తిరిగి ప్రతిపాదించింది. స్టీల్‌ప్లాంట్‌ విలువను రూ. 4898 కోట్లుగా నిర్ణయించింది. 22 వేల ఎకరాల భూమిని, 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో అత్యంత ఆధునిక స్టీల్‌ ప్లాంట్‌ను కారుచౌకగా అమ్మకానికి పెట్టారు. దక్షిణ కొరియా కంపెనీ 'పోస్కో'కు కట్టబెట్టటానికి తయారయ్యారు. ఒక ఎకరం భూమి మార్కెట్‌ విలువ రూ.10 కోట్ల పైన వుంటే, 22 వేల ఎకరాల భూమి ఎంతవుతుందో తెలియదా? స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించటానికి ఎంతవుతుందో తెలియదా? హిందూ పత్రిక అంచనా ప్రకారం రూ.3.2 లక్షల కోట్లకన్నా తక్కువ వుండదు. ప్రభుత్వం ఇంత దివాళా తీసిందా? ఆస్ధులను అమ్ముకుని తినటానికి పూనుకున్నారా? లక్షల కోట్ల ప్రజల ఆస్ధిని అమ్ముకోవటానికేనా వీరికి అధికారం కట్టపెట్టింది.
  అన్ని స్టీల్‌ ప్లాంట్లకూ స్వంత ఇనప ఖనిజ గనులుంటాయి. ప్రభుత్వ సంస్ధ అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వంత గనులను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా రూ.500, రవాణా ఖర్చులతో రూ. 1000 అయ్యే టన్ను ఇనప ఖనిజానికి రూ.3 వేలు పెట్టి కొనుక్కోవలసి వస్తుంది. ప్రతి టన్నుకీ అదనంగా రూ.2 వేలు ఖర్చు చేస్తుంది. స్వంత కేప్టివ్‌ మైన్స్‌ వుంటే పరిశ్రమ నష్టాలలో పడే ప్రసక్తే లేదు. నాణ్యమైన స్టీల్‌ను తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. ప్రైవేటు కంపెనీలైన టాటా, మిట్టల్‌ లాంటి వారికి ఇనప ఖనిజ గనులను కేటాయించారు. స్టీల్‌ప్లాంట్‌ లేని బ్రాహ్మణి స్టీల్స్‌కు స్వంత గనులను కేటాయించారు. గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించి, ఇతర దేశాలకు ఇనప ఖనిజం అమ్ముకోవటానికి అన్ని అనుమతులనూ ఇచ్చి దేశ సంపదను దోచిపెడ్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు గనులను కేటాయించమని కార్మికులు నిరంతరం పోరు పెడ్తున్నారు. అయినా తమ వర్గ మిత్రులైన పెద్ద పెట్టుబడిదారులైన టాటా, మిట్టల్‌, గాలి జనార్ధనరెడ్డి కి, విదేశీ దోపిడీ మిత్రులైన పోస్కో లాంటి కంపెనీలకు సహజ వనరైన ఇనప ఖనిజాన్ని దోచిపెడ్తున్నారు. 'అదిగో నష్టం వచ్చింది కదా' అని అబద్ధాలు చెప్పి ప్లాంట్‌ అమ్మకానికి పెట్టి అదేమన్నవారిని బెదిరిస్తున్నారు.
   విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపిస్తామన్న కేంద్ర మంత్రి సి.సుబ్రమణ్యం, ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి చేసిన వాగ్దానాలను, ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాల అమలును ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నించారు. అమృతరావు నిరాహారదీక్షను పూర్తిగా బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మాట విని అమృతరావు అర్ధాంతరంగా నిరాహారదీక్షను విరమించినా, తెలుగు ప్రజలు పోరాటాన్ని కొనసాగించారు. విద్యార్ధులు, యువకులు, కార్మికుల ఐక్య పోరాటం వలననే విశాఖ ఉక్కు సాధ్యమైంది.
   విశాఖ ఉక్కు సాధనలో తెలుగు ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పరమ కిరాతకంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. 32 మంది తెలుగు బిడ్డలను అన్యాయంగా పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 100 మందికి పైగా ప్రజలను తుపాకీ గుళ్ళతో గాయపరిచారు. లాఠీ ఛార్జీలతో శరీరాన్ని కుళ్ళపొడిచారు. వేలాదిమందిని బాష్పవాయువు ప్రయోగంతో బాధలు పెట్టారు. వెయ్యి మందికి పైగా అరెస్టులు చేశారు. క్రిమినల్‌ కేసులు పెట్టి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిప్పారు. సైనికులు విమానాల ద్వారా విశాఖలో దిగి కవాతులు చేశారు. నెలల తరబడి సైనికులు, పోలీసులు పరిపాలించారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ప్రజలు ఎదిరించారు. అయిదేళ్ళ తరువాతనైనా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఇవ్వక తప్పలేదు.
    ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రజా పోరాటాలదే కీలక పాత్ర. భూమి కోసం, భూమిపై హక్కు కోసం సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, రుణ విముక్తి కోసం రైతు యాత్రలూ, నైజాం వ్యతిరేక సాయుధ పోరాటం, నాగార్జున సాగర్‌ కోసం, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ సాగిన పోరాటాల ఫలితంగానే అభివృద్ధి సాధ్యమైంది. పోరాట ఫలాలను, భూమిని, కంపెనీలను మింగేయటానికి కార్పొరేట్‌ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ద్రవ్య పెట్టుబడి దెయ్యంలాగా జడలు విప్పుకుని నాట్యం చేస్తున్నది.
   ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ఉక్కు-కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటం లేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడి వున్నాయి. పోర్టు సిటీ స్టీల్‌ సిటీగా మారింది. రూ. 4898 కోట్ల మూల పెట్టుబడితో ప్రారంభించిన పరిశ్రమ ఈ రోజున రూ.3.2 లక్షల కోట్లకు మించిన విలువతో, 22 వేల ఎకరాల భూమిలో, ఆధునిక సాంకేతికతను స్వంతం చేసుకుని అత్యంత నాణ్యమైన ఉక్కును ప్రపంచానికి అందిస్తున్నది. రిజర్వేషన్లను అమలు పరుస్తూ 35 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. వీరిపై ఆధారపడి రెండు లక్షల మంది ప్రజలు బతుకుతున్నారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన రూ.4898 కోట్లకు గాను-పన్నులు, డివిడెండ్ల రూపంలో రూ.40 వేల కోట్లను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానికి సమకూర్చింది. రూ. 7977 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ప్లాంట్‌ విస్తరణ అప్పులకు వడ్డీగా రూ.18,000 కోట్లను చెల్లించింది.
   గత డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పని తీరు గమనిస్తే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటు 98 శాతం ఉత్పత్తితో పని చేసి రూ.2,100 కోట్ల టర్నోవర్‌ను, రూ.170 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
   అత్యంత విలువైన ఈ కర్మాగారాన్ని కాజేయటానికి కార్పొరేట్‌ కంపెనీలు గద్దల్లా కాచుకుని కూర్చున్నాయి. హారతి పళ్ళెంలో పెట్టి అందించటానికి ప్రభుత్వాలు సిద్ధంగా వున్నాయి. రక్తం ధారబోసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలందరిదీ. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్య పోరాటం వలననే ఇది సాధ్యమవుతుంది.
 

(వ్యాసకర్త నాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త)
డా|| కొల్లా రాజమోహన్‌

kolla rajamohan