- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి-ఉక్కునగరం, విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకూ పోరాడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారంనాటికి 704వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ ఎఫ్‌ఎండిఆర్‌ఎస్ అండ్ ఆర్‌ఎస్, జనరల్ హాస్పిటల్ విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో పండుగ రోజు కూడా కార్మికులు తమ నిరసన తెలియజేయడం పోరాటపటిమకు నిదర్శనమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పుడే ఉద్యోగులకు నిజమైన పండుగ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేంతవరకు ఉద్యోగులు అలుపెరగని పోరాటం చేస్తారని తెలిపారు. ఇప్పటికే ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమై అనేక కార్మిక సంఘాలకు స్ఫూర్తిదాయకంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగం ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని కేంద్రంలోని మోడీ సర్కారు గుర్తించి ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.










