Nov 09,2023 20:50

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌:అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో గుడిసెలు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని, నాయకుల పట్ల దాడి చేసి అనుచితంగా వ్యవహరించిన సిఐ నరేంద్రరెడ్డిని సస్సెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గురువారం కలెక్టరేట్‌ ఎదట ధర్నా నిర్వహించారు. పేదల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గుడిసెలను తొలగించిన చోటే బాధితులకు ఇళ్లునిర్మించి ఇవ్వాలని అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ధర్నాలో గుడిసెలు కోల్పోయిన మహిళలు చంటిపిల్లలతో సహా పాల్గన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే ఉన్న ఫలంగా గుడిసెలు తొలగించి వారిని రోడ్లపై పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ భూములంటూ పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించారని, అదే స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న అధికార పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కేవలం దళిత, గిరిజనులు వేసుకున్న రెండు ఎకరాల భూమిని ఖాళీ చేయించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చట్టాన్ని ప్రయోగించారని తెలిపారు. అదే స్థలంపై హైకోర్టు దిశానిర్ధేశం చేస్తే వాటి ఊసే ఎత్తకుండా ఏకపక్షంగా అధికార పార్టీ నేతల ఆదేశాలను అధికారులు అమలు చేయడం అన్యాయమన్నారు. సిఐ నరేంద్ర రెడ్డి అమానవీయంగా వ్యవహరించి మహిళలను దూషించారన్నారు. గుడిసెల తొలగింపును అడ్డుకునేందుకు వెళ్లిన తమపై కూడా దాడి చేశారని తెలిపారు. సిఐపై అధికారులు విచారణ జరపాలని, అధికారుల నిర్ణయం తరువాత సిఐపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, సిపిఐఎంఎల్‌, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ఎంఆర్‌పిఎస్‌, సిఐటియు, కౌలు రైతు సంఘం, ఎపి రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతలు పాల్గన్నారు.