-ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన జెఎన్‌టియు విద్యార్థుల ఆందోళన
- యూనివర్సిటీ గేటువద్ద బైఠాయింపు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్:జెఎన్‌టియు గురజాడ యూనివర్సిటీలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన బుధవారం యూనివర్శిటీ మెయిన్‌గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి యాజమాన్య వైఖరికి నిరసిస్తు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం వెంకటేష్, పి రామ్మోహన్ మాట్లాడారు. జెఎన్‌టియులో వసతిగృహాల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు పస్తులుంటున్నారన్నారు. బయట లైట్లు కూడా లేకపోవడం, కొండకు ఆనుకొని ఉండడం వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు విద్యార్థులు, అధ్యాపకులు తెలియజేస్తే బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు. కూలిపోయిన బాలురు ఇండోర్ స్టేడియం తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు చదువుకోవడానికి అత్యవసరమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, యూనివర్సిటీ క్యాంపస్ నుంచి జెఎన్‌టియు జంక్షన్ వరకు బస్ ఏర్పాటు చేయాలని కోరారు. దాదాపు 29 సమస్యలను అధికారుల దృష్టికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీసుకెళ్లారు. విద్యార్థులు మాట్లాడుతూ వసతిగృహాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరువు పెట్టారు. అధికారులకు తెలియజేస్తే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను, విద్యార్థులను పిలిచి సమస్యలపై వైస్ ఛాన్సలర్ చర్చించారు. అయినప్పటికీ సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుకు రాకపోవడంతో విద్యార్థులంతా రాత్రి కూడా ఆందోళన కొనసాగించారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం సౌమ్య, జిల్లా సహాయ కార్యదర్శి జె రవి, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.