Nov 08,2023 08:32

- అఖిలపక్ష రైతు సంఘాలు, వామపక్షాలు డిమాండ్‌
- కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన
ప్రజాశక్తి- వైఎస్‌ఆర్‌ అర్బన్‌:వైఎస్‌ఆర్‌ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుందని, కరువు జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష రైతు సంఘాలు, వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. తొమ్మిదిన సిఎం పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేనాటికి 36 మండలాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయని వాపోయారు. ఆందోళనకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఓబులేసు, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు జి.శ్రీరాములు, అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, సుబ్బారెడ్డి, రమణ, శివారెడ్డి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే కొంతవరకైనా కరువును నివారించవచ్చని, పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో కరువు విలయతాండం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 103 కరువు మండలాలు ప్రకటిస్తే కడప జిల్లా నుంచి ఒక్క కరువు మండలం కూడా ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండుతున్నాయని, సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ పంట వేసుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. కరువు జిల్లాగా ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, బిఎస్‌పి, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.