Nov 12,2023 08:06

ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం బహిరంగ మద్దతివ్వడం గర్హనీయం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో శనివారం పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అమెరికాతో చేరి ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించి ప్రపంచంలో మనం ఒంటరి వారమవుతున్నామని అన్నారు. హమాస్‌ దాడికి ప్రతీకారం పేరుతో ఇజ్రాయిల్‌ దాడి అని చెప్పడంలో వాస్తవం లేదని, 40 ఏళ్లుగా పాలస్తీనా అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఇజ్రాయిల్‌ వారి సొంత దేశంలో కూడా వారు శరణార్థులుగా ఉన్నారన్నారు. మోడీ పాత విదేశాంగ విధానాన్ని అవలంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాలస్తీనాకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలబడాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముస్లిం వ్యతిరేకతతో మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతు తెలుపుతోందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌, పాలస్తీనాపై యుద్ధాన్ని ఆపేందుకు మోడీ ప్రభుత్వం పూనుకోవాలన్నారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో పసిపిల్లలు, చిన్నారులు చనిపోతున్నారన్నారు. యుద్ధం వల్ల 3.90 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. మోడీ సంప్రదాయానికి విరుద్ధంగా ఇజ్రాయిల్‌కు మద్దతివ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు (వైవి), సిహెచ్‌ బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జయరామ్‌, హరికిశోర్‌, సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు, వివిఎల్‌ నరసింహులు, సిపిఐ నగర సమితి నాయకులు జి కోటేశ్వరరావు, ఎంసిపిఐ(యు) నాయకులు ఖాదర్‌ బాషా, ఎంసిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ నాయకులు రవిచంద్ర, ఎస్‌యుసిఐ నాయకులు సుధీర్‌కుమార్‌, మహిళా సంఘం నాయకులు కె స్వరూపరాణి, పి దుర్గాంబ, భారతి, విద్యార్థి సంఘ నాయకులు పాల్గన్నారు. ఈ సందర్భంగా ప్రజా నాట్యమండలి కళాకారులు పాటలు పాడారు. ఇజ్రాయిల్‌ తక్షణమే యుద్ధాన్ని నిలుపుదల చేయాలని, పాలస్తీనాకు మద్దతుగా భారత్‌ నిలవాలని, యుద్ధం వద్దు.. శాంతి ముద్దు.. అని నినాదాలు చేశారు.