- ఐరాస ఆధ్వర్యంలో కాల్పుల విరమణ పాటించాలి
- పాలస్తీనా సంఘీభావ సభలో వామపక్ష నేతలు డిమాండ్
- గాజాపై దాడులకు అమెరికా మద్దతుపై ఏచూరి ఆగ్రహం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండకు ఆపాలని, అక్కడ చిక్కుకున్న మహిళలు, చిన్నారులను తక్షణమే ఆదుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. 2+2 సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మంగళవారం నాడిక్కడకు వచ్చిన సందర్భంగా నిరసన తెలపాలన్న వామపక్షాల పిలుపులో భాగంగా అయిదు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యాన సంఘీభావ సభ జరిగింది. హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో జరిగిన ఈ సభలో సిపిం, సిపిఐ, సిపిఐ- ఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు భారత్‌లోని పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్హైజా హాజరయ్యారు. ఆత్మరక్షణ ముసుగులో యూదు దురహంకార ప్రభుత్వం సాగిస్తున్న మారణహౌమాన్ని వక్తలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ గాజాలో ప్రస్తుతం జరుగుతున్నది రెండు సైన్యాల మధ్య యుద్ధం కాదని, యూదు దురహంకార ఇజ్రాయిల్ సాగిస్తున్న అత్యంత భయానకమైన మారణకాండ అని అన్నారు. శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులు, ఐరాస ఆధ్వర్యంలోని శరణార్థి శిబిరాలపైన బాంబులు కురిపించి, అంతులేని వినాశనాన్ని సృష్టిస్తోందని అన్నారు. అంతర్జాతీయ చట్టాలు, నియమాలను ఇజ్రాయిల్ కాలరాస్తోందని విమర్శించారు. హమాస్‌పై దాడి చేస్తున్నామని చెబుతున్నవారు హమాస్ ఉనికే లేని వెస్ట్ బ్యాంక్‌పై ఎందుకు బాంబులు వేస్తున్నారని ప్రశ్నించారు. అమెరికా, దాని మిత్రదేశాలు ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహౌమానికి ఆర్థిక, సైనిక సహకారాన్ని అందిస్తున్నాయని ఆయన విమర్శించారు. కాల్పుల విరమణ కోసం ఒత్తిడిని తీవ్రతరం చేసే పోరాటంలో భారతీయులందరూ పాల్గొనాలని ఏచూరి పిలుపునిచ్చారు. వామపక్షాల మద్దతుకు భారత్‌లో పాలస్తీనా దౌత్యవేత్త అద్నాన్ అబు అల్ హైజా కృతజ్ఞతలు తెలియజేశారు. పాలస్తీనా రాష్ట్రానికి చెందిన 73 శాతం భూమిని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు. బెంజమిన్ నెతన్యాహు ఒక వలసదారు, రెండు దేశాల సిద్ధాంతాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. తమ సొంత ఇంటిలోని ఒక్క గదిలోకి వెళ్లడానికి కూడా ఆక్రమిత బలగాలు అనుమతించవని అన్నారు. వారికి ఆత్మరక్షణ అంటే నరమేధమని అన్నారు. అల్-అక్సా మిగతా 2లో మసీదును విభజించేందుకు యూదు దురహంకార ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అక్రమ వలసలే ప్రాథమిక సమస్య అని పేర్కొంటూ, 1967కి ముందున్న సరిహద్దులతో తూర్పు జెరూసలెం కేంద్రంగా పాలస్తీనా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్, సిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్, ఆర్‌ఎస్‌పీ నేత ప్రకాశరావు మాట్లాడారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ తదితరులు పాల్గొన్నారు. జననాట్య మంచ్ కళాకారులు కళారూపాలు ప్రదర్శించారు.