Nov 08,2023 21:42

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ నాయకులు వై సాంబశివరావు, సిపిఐఎంఎల్‌ నాయకులు జాస్తి కిషోర్‌, ఎంసిపిఐయు నాయకులు కాటం నాగభూషణం, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు ఎన్‌ మూర్తి, ఎస్‌యుసిఐసి నాయకులు బిఎస్‌ అమర్‌నాథ్‌, ఫార్వార్డ్‌బ్లాక్‌ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు బుధవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. గాజాపై ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా చేస్తున్న యుద్ధం నెల రోజులు దాటిందని, వేలాదిమంది ఈ మారణకాండలో బలవుతున్నారని తెలిపారు. శరణార్థి శిబిరాలపైనా బాంబుదాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పసిపిల్లలు, మహిళలు, పౌరుల శవాలగుట్టలు హృదయ విదారకంగా ఉన్నాయని వివరించారు. దాడులకు వ్యతిరేకంగా ప్రపంచంలో అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయిల్‌ ఏ మాత్రమూ వెనక్కు తగ్గడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులను తక్షణమే ఆపేయాలని కోరుతూ ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిరసనలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పెద్దయెత్తున పాల్గోని పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించి జయప్రదం చేయాలని కోరారు.