Nov 05,2023 10:51

ఎన్‌ఇపి, ఫీజుల పెంపుపై ఆగ్రహం -  ప్రచారానికి సిద్ధమవుతున్న 16 విద్యార్థి సంఘాల కూటమి
న్యూఢిల్లీ : 
 కేంద్రంలోని అధికార బిజెపికి వ్యతిరేకంగా విద్యార్థులు ఏకమయ్యారు. బిజెపిని, నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి), క్యాంపస్‌లలో మతతత్వం, ఫీజుల పెరుగుదలను వ్యతిరేకిస్తూ దాదాపు 16 విద్యార్థి సంఘాలు చేతులు కలిపాయి. వాటిలో వామపక్ష, ప్రతిపక్షాలకు చెందిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, సిఆర్‌జెడి, డిఎంకె విద్యార్థి విభాగం, ఎన్‌ఎస్‌యుఐ, సమాజ్‌వాదీ ఛాత్ర సభ వంటి పేరు పొందిన విద్యార్థి సంఘాలు ఇందులో ఉన్నాయి. ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే తీసుకొచ్చిన ఎన్‌ఇపిని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల నుంచి ముఖ్యమైన భాగాలను తొలగించి విద్యారంగానికి మతం రంగు పూస్తున్నారని విమర్శించాయి. ఈ మేరకు ఈ విద్యార్థి సంఘాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. '' విద్యారంగం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత స్పష్టంగా ఉన్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా ఉండే అంశాలతో మత భావాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నది. దేశం పేరు ఇండియాను పుస్తకాల నుంచి తొలగించే ప్రయత్నాన్ని బిజెపి ఇప్పటికే మొదలు పెట్టింది'' అని విద్యార్థి సంఘాలు విమర్శించాయి. వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయనీ, అలాగే, బిజెపి ప్రభుత్వాన్ని నియంత్రించే ప్రపంచంలోనే అతిపెద్ద ఫాసిస్టు సంస్థ ఏర్పడి 2025 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటున్నదని ఆర్‌ఎస్‌ఎస్‌ను పరోక్షంగా ఉటంకిస్తూ వెల్లడించాయి.
'విద్యార్థులకు తెలిసేలా ప్రచారం'
ఎన్‌ఇపి ప్రేరిత ఫీజుల పెంపుపై దేశవ్యాప్తంగా త్వరలోనే ప్రచారాన్ని నిర్వహించి విద్యార్థులకు తెలియబరుస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జనరల్‌ సెక్రెటరీ మయూఖ్‌ బిశ్వాస్‌ అన్నారు. క్యాంపస్‌లలో కాషాయీకరణను సహించబోమని స్పష్టం చేశారు. ఎన్‌ఇపి దేశ సమగ్రత, సహకార సమాక్య విధానాన్ని వ్యతిరేకమని డిఎంకె విద్యార్థి విభాగం హెడ్‌ సివిఎంపి ఎఝిలరసన్‌ ఆరోపించారు. బిజెపి పాలనలో ప్రయివేటీకరణ దారుణంగా పెరిగిపోతున్నదని సిఆర్‌జెడి జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక భారతి ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో యూని వర్సిటీలలో ఫీజులు పెరిగాయనీ, జెఎన్‌యు వంటి క్యాంపస్‌లలో పోరాటాలు జరిగాయన్నారు. విద్య కేంద్రీకరణ, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘా లు భారీ ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని భారతి ఆరోపించారు.