త్రిసూర్ : బిజెపి, సురేష్ గోపిపై త్రిసూర్ ఆర్చ్ డియోసెస్ శుక్రవారం తీవ్ర విమర్శలు గుప్పించింది. మణిపూర్ మంటల్లో తగలబడినపుడు వీరు ఏం చేశారని ప్రశ్నించింది. త్రిస్సూర్ ఆర్చ్ డియోసెస్ మౌత్‌పీస్ 'కాథలిక్‌కాసభ' నవంబర్ ఎడిషన్‌లో కేంద్రంతో పాటు బిజెపి కేరళ యూనిట్ సభ్యులు, మాజీ ఎంపి సురేష్ గోపిని తీవ్రంగా విమర్శించింది. 'మరకిళ్ల మణిపూర్' పేరుతో సంపాదకీయం ప్రచురించింది. మొయితీల హింసాకాండకు మతతత్వ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని మండిపడింది. మణిపూర్, యుపి గురించి మీరు పట్టించుకోనవసరం లేదని, అక్కడి విషయలను చూసుకునేందుకు ప్రత్యేకంగా 'మనుషులు' ఉన్నారని సురేష్ గోపీ కన్నూర్ ర్యాలీ సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మణిపూర్ అల్లర్ల సమయంలో ప్రధాని మౌనం వహించడం వెనుక కారణం ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే వారికే అర్థమవుతుందని పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో విపత్తులు సంభవించినప్పుడు... అక్కడ ప్రత్యక్షమయ్యే ప్రధాని, మణిపూర్‌లో ఒక్కసారి కూడా పర్యటించలేదని మండిపడింది. ఆస్ట్రేలియాలో ఆలయంపై దాడి జరిగినప్పుడు ప్రధాని పలుమార్లు ప్రస్తావించారని, కానీ మణిపూర్‌లో సుమారు 300 చర్చిలను ధ్వంసం చేసినప్పుడు ఆయన ఎందుకు మౌనం వహించారని నిలదీసింది. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలకుండా ఉండేందుకు మణిపూర్ అంశాన్ని దాచిపెట్టేందుకు బిజెపి తీవ్రంగా యత్నిస్తోందని పేర్కొంది. కేరళ ప్రజలు తమకు ఓట్లు వేస్తారని, కేరళను మణిపూర్‌లా మార్చాలని కేంద్రం ఆశిస్తోందని, మణిపూర్‌ను పునరావృతం చేయాలని చూస్తోందా అని ప్రశ్నించింది.
.
మణిపూర్‌లో ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా మౌనం వహించడమంటే హింసకు లైసెన్సు ఇవ్వడమేనిని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఓట్ల కోసం యత్నిస్తున్నారని... అయితే కేరళ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని హెచ్చరించింది. త్రిస్సూర్‌లో సొంత పార్టీ సభ్యులు లేనందునే పురుషులు సురేష్ గోపీని బరిలోకి దించేందుకు యత్నిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఎన్నికల ముందు ఎన్ని వేషాలు వేసినా మతతత్వ వాదులను గుర్తించే విజ్ఞత కేరళ ప్రజలకు ఉందని క్యాథలిక్ చర్చి అభిప్రాయపడింది. మణిపూర్ అల్లర్లను కేంద్రం నియంత్రించలేకపోయిందని ఆర్చ్ డియోసెస్ విమర్శించింది.