కోజికోడ్ : జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నటుడు, రాజకీయ నేత సురేష్ గోపి నవంబర్ 15న విచారణకు హాజరుకానున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బుధవారం కోజికోడ్ నగరంలోని నడకావు పోలీస్ స్టేషన్‌లో విచారణ అధికారి ఎదుట హాజరుకానున్నారు. ఈ కేసులో రెండు వారాల సుదీర్ఘ విచారణ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 18లోగా విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని కోరుతూ నవంబర్ 10న నటుడికి పోలీసులు నోటీసులు జారీ చేశామని అన్నారు.
గత నెల కొజికోడ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గన్న సురేష్ గోపి, మహిళా జర్నలిస్టు అనుమతి లేకుండానే ఆమెను పదే పదే తాకాడు. సురేష్ గోపి వైకిలి చేష్టలపై మహిళా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తనను అవమానించారంటూ జిల్లా ఎస్పీకి బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. కేరళలో ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై సదరు మహిళా జర్నలిస్టు గోపిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆమె భుజంపై పదేపదే చేయి వేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాధిత మహిళా జర్నలిస్టు ఆయన చేయి తీసిపారేస్తున్నా ఆయన తన వెకిలిచేష్టలు ఆపలేదు. 'మమ్మల్ని ప్రయత్నించనీ తల్లీ..' అంటూ చేయి వేస్తూనేవున్నారు. సురేష్ వైఖరిని గమనించిన ఆమె గట్టిగా తోసివేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇది మహిళలను అవమానించడమేనని కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. సదరు నేత బాడీ లాంగ్వేజ్ అసభ్యంగా, అనుచితంగా వుందని నెట్‌వర్క్ ఆఫ్ వుమెన్ ఇన్ మీడియా, ఇండియా విమర్శించింది.