Oct 27,2023 07:51

- తాజాగా ఆల్‌ జజిరా జర్నలిస్టు కుటుంబం బలి
జెరూసలెం : గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో పాత్రికేయులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25 మంది పైగా పాత్రికేయులు చనిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన ఇజ్రాయిల్‌ దాడుల్లో ఆల్‌ జజీరా జర్నలిస్టు, అరబిక్‌ బ్యూరో ఛీఫ్‌ వేల్‌ అల్‌ దహదౌ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్‌ గాజాలోని ఇజ్రాయెల్‌ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్‌ క్యాంప్‌ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో భార్య, కుమార్తె, కుమారుడిని కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దహదౌ భార్య కుమారుడు, కుమార్తె గాజాలో నివసిస్తున్నారు. సురక్షితమైన ఈ ప్రాంతాన్ని టార్గెట్‌ చేసుకుని వైమానిక దాడులకు దిగబోతున్నాయనే విషయాన్ని భార్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా వారిపై దాడి జరిగింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా శిథిలాల కింద సమాధి అయ్యారు. ఆస్పత్రిలో విగతజీవిగా పడి ఉన్న కుటుంబ సభ్యులను చూసిన దహదౌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. 'ఏమి జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లలు, మహిళలు, పౌరులే టార్గెట్‌గా చేస్తున్న వరుస దాడులివి. ఇజ్రాయెల్‌ దాడులు నుసైరాత్‌తో సహా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేస్తున్న దాడుల గురించి యార్మూక్‌ నుండి రిపోర్టు చేస్తున్నాను.. అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉన్న వారికి శిక్షించకుండా వదిలి పెట్టరనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా లక్ష్యంగా చేసుకుని చంపడాన్ని అల్‌ జజీరా తీవ్రంగా ఖండించింది. మరికొంత మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా గల్లంతు అయినట్టు సమాచారం.