ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించాయి. బందీల విడుదల కోసం ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 50 మంది బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. బందీలను విడుదల చేయడానికి, మానవతావాదుల ప్రవేశాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ బుధవారం నాలుగు రోజుల పాటు యుద్ధం విరామానికి అంగీకరించాయి. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనుంది. ఆ సమయంలో గాజాలో సైనిక దాడులను నిలిపివేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. అదే సమయంలో హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 240 మందిలో నుంచి కనీసం 50 మందిని విడిచిపెట్టాల్సి ఉంటుందని తెలిపింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులను హమాస్ వదిలేయనున్నట్లు పేర్కొంది. ''బందీలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడమే మా లక్ష్యం. ఇందుకోసం తాత్కాలిక కాల్పుల విరమణ చేపట్టేందుకు హమాస్‌తో ఒప్పందానికి ప్రభుత్వం అంగీకరించింది'' అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తమ ప్రకటనలో వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాజా ప్రకటనలో నెతన్యాహు సర్కారు మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.