- పార్టీపై అసమ్మతి నాయకుల తిరుగుబాటు స్వరం
- టికెట్ దక్కకపోవటంతో ఆందోళనలు
- రాష్ట్రవ్యాప్తంగా అనేక స్థానాల్లో ఇదే పరిస్థితి
జైపూర్ : తాము ఇతర పార్టీల కంటే భిన్నమనీ, పార్టీలో భిన్నాభిప్రాయాలున్నా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తామని బిజెపి నాయకులు చెప్పే మాటలు. కాంగ్రెస్, ఇతర పార్టీల కంటే తమ పార్టీ గొప్పదని వారు వాదనలు వినిపిస్తుంటారు. కానీ రాజస్థాన్‌లోని బిజెపిలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన తర్వాత ఆ పార్టీలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
రాష్ట్రంలో అధికారానికి దూరమైన బిజెపి ఇప్పుడు తమ పార్టీలోని స్వంత నాయకుల నుంచే తిరుగుబాట్లను ఎదుర్కొంటున్నది. నాయకుల నిరసన గళాలతో పోరాడుతున్నది. ముఖ్యంగా, బిజెపి సీనియర్ నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను శాంతింపజేసే విషయంలో బిజెపి విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిజెపి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో వసుంధర రాజే వర్గం వారికి మొండి చేయి ఎదురైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఈ తరుణంలో రాజే శిబిరానికి ప్రాధాన్యతనివ్వడం ద్వారా, అంతర్గత విభేదాలు తగ్గించాలనీ, టికెట్ ఆశించేవారు, వారి మద్దతుదారుల నుంచి పెరుగుతున్న తిరుగుబాటును అణిచివేయాలని బిజెపి భావిస్తున్నదని తెలిపారు.
బిజెపి విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తోర్‌గఢ్, రాజ్‌సమంద్, ఉదరుపూర్, కోట, జైపూర్, అల్వార్, బుండీలలో తిరుగు బాటు నేతల మద్దతు దారులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తు న్నారు. బిజెపి కార్య కర్తల నిర సనలు ఈ జిల్లాల్లో ఆందోళనకరంగా మారాయి. టికెట్ నిరాకరణకు గురైన అభ్యర్థుల విధేయులు, పార్టీ అగ్ర నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసిన పరిస్థితులు కనబడటం గమనార్హం. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సిపి జోషి సొంతగడ్డ చిత్తోర్‌గఢ్‌లో అత్యంత తీవ్రమైన స్థాయిలో నిరసనలు చెలరేగటం గమనార్హం. మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకి స్థానం కల్పించడానికి చిత్తోర్‌గఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రభన్ సింగ్ ఆక్యను ఈ స్థానం నుంచి తొలగించారు. అలాగే, రజ్వీని జైపూర్‌లోని విద్యాధర్ నగర్ స్థానం నుంచి మార్చి.. అక్కడ రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారికి మొదటి జాబితాలో టికెట్ కేటాయించటం రజ్వీ వర్గానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
ఉదయపూర్‌లో నగర డిప్యూటీ మేయర్ పరాస్ సింఘ్వి తారాచంద్ జైన్‌కు టిక్కెట్‌ను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. బిజెపి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బిజెపి నాయకులు, కార్యకర్తలు కోరుతుండటం గమనార్హం. జైపూర్‌లో సంగనేర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ లాహౌటీ మద్దతుదారులు ఆదివారం బిజెపి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాజే విధేయుడైన లాహౌటీ స్థానంలో భజన్ లాల్ శర్మను నియమించారు. బిజెపి కార్యాలయం వద్ద లాహౌటి విధేయులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.