Oct 23,2023 10:36
  • రాజస్థాన్‌లో కార్యాలయాల ధ్వంసం, దిష్టిబొమ్మల దహనం
  • మధ్యప్రదేశ్‌లోను ఆందోళనలు

న్యూఢిల్లీ : టికెట్లు అమ్ముకున్నారని, అనర్హులకు ఇచ్చారని ఆరోపిస్తూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బిజెపి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బయటి వ్యక్తులను వెనక్కి పంపాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన తర్వాత ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బిజెపి శనివారం విడుదల చేసిన రెండో జాబితాలో 83 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 124కి చేరుకుంది. పార్టీ కార్యకర్తలు చిత్తోర్‌గఢ్‌, రాజ్‌సమంద్‌, బుండి, అల్వార్‌, ఉదయపూర్‌, జైపూర్‌లలో నిరసనలు చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపి. జోషికి పార్టీ జిల్లా విభాగాలకు చెందిన పలువురు పదాధికారులు తమ రాజీనామాలను సమర్పించారు. చిత్తోర్‌గఢ్‌ ఎమ్మెల్యే చంద్రభన్‌ సింగ్‌ ఆక్య తనకు సీటు నిరాకరించడానికి జోషినే బాద్యుడని, ఈ నిర్ణయం వల్ల పార్టీ నష్టపోతుందని అన్నారు. ఆక్య మద్దతుదారులు జోషి దిష్టిబొమ్మను దహనం చేశారు. మధుబన్‌ కాలనీలోని జోషి నివాసం ప్రవేశ ద్వారంపై కొందరు యువకులు రాళ్లు రువ్వడంతో భద్రతను పటిష్టం చేశారు.
           రాజ్‌సమంద్‌లోని బిజెపి కార్యాలయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయం ముందు రోడ్డుపై ఎన్నికల సామగ్రిని ధ్వంసం చేయడం, ఫర్నీచర్‌ ధ్వంసం చేయడం, టైర్లను తగులబెట్టడం వంటివి చేయడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
          అశోక్‌ డోగ్రాకు వ్యతిరేకంగా బుండీలో, సంజరు శర్మకు వ్యతిరేకంగా అల్వార్‌లో నిరసనలు జరిగాయి. వీరిద్దరూ 2018లో గెలిచి మళ్లీ రంగంలోకి దిగారు. జైపూర్‌ సమీపంలోని సంగనేర్‌ నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అశోక్‌ లాహోటి మద్దతుదారులు భజన్‌లాల్‌ శర్మకు టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయం వెలుపల నినాదాలు చేశారు.
 

                                     మధ్యప్రదేశ్‌లో టికెట్ల కేటాయింపుపై బిజెపి కార్యకర్తల నిరసన

బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 17న జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 92 మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బిజెపి శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశించిన అభ్యర్థుల మద్దతుదారులు, బిజెపి కార్యకర్తలు పలుచోట్ల నిరసనకు దిగారు. ఆ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అందరూ మంచి అభ్యర్థులే అని, చాలామంది టికెట్లు అడగడం వల్ల కొన్ని విభేదాలు ఉన్నాయని, పార్టీలో పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు.