- డబ్బు అయినా ఇవ్వండి... ముడి సరుకైనా పంపండంటూ ప్రకటన
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తోన్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ స్థాయిని కేంద్ర ప్రభుత్వం దిగజార్చుతోంది. దొంగదెబ్బ తీయాలని చూస్తోంది. స్టీల్ ఉత్పత్తికి డబ్బులైనా ఇవ్వండి లేదా మెటీరియల్ అయినా ఇవ్వండి అంటూ ప్రయివేట్ సంస్థల ముందు మోకరిల్లేలా స్టీల్ యాజమాన్యం ద్వారా కుట్ర చేసింది. కోల్, ఐరన్ ఓర్ ముడి సరుకును నేషనల్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి) ద్వారా సమకూర్చకుండా చేతులెత్తే సింది. దీంతో, గడిచిన కొద్ది రోజులుగా రా మెటీరియల్ లేక స్టీలు ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రయివేట్ సంస్థలను ఆశ్రయించాల్సి వచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్వహణకు కావలసిన ముడి పదార్థాల సరఫరాకు ప్రయివేట్ వారిని ఆహ్వానిస్తూ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ)ను సోమవారం జారీ చేసింది. డబ్బులుగానీ, ముడిసరుకుగానీ సరఫరా చేస్తే అందుకు ప్రతిగా స్టీలును ఇస్తామంటూ సోమవారం ప్రకటన జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేట్ సంస్థల ముందు మోకరిల్లేలా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్లకు ధారదత్తం చేసేందుకు, ఉత్పత్తిని దెబ్బతీసేందుకు ఒకదాని వెంట మరొక కుట్రకు పాల్పడుతోందని అంటు న్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 774 రోజు లుగా ఆందోళన చేస్తోన్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఖండించిన స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్
ఇఒఐ జారీ చేయడాన్ని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్, యు.రామస్వామి ఖండించారు. ముడి పదార్థాల సరఫరాకు సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని, ఆ పనిని ప్రయివేటుకు అప్పగించడం తగదని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా స్టీల్ ప్లాంట్‌కు ముడి పదార్థాలు లేవంటూ ఎప్పుడైనా ఉత్పత్తిని ఆపేయవచ్చు అంటూ ప్రచారం చేయడాన్ని, యూనియన్లకు కనీసం చెప్పకుండా ముడి పదార్థాల సరఫరా కోసం ప్రయివేటు వారిని ఆహ్వానించడాన్ని తప్పుపట్టారు. ప్రస్తుత ముడి పదార్థాల సమస్య గురించి యూనియన్లకు, కార్మికులకు తెలియజేయాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉందని పేర్కొన్నారు. ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో నడిపించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతూ యూనియన్ల నాయకులు ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా యాజమాన్యం ఏకపక్షంగా ఇఒఐ పిలవడం తగదని తెలిపారు. తక్షణమే యూనియన్లతో చర్చించాలని, కార్మికులకు ఈ విషయం వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ స్టీల్ పరిశ్రమకూ రాని ముడి పదార్థాలు, రైల్వే రేకుల కొరత విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రమే రావడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని పేర్కొన్నారు.










