- డిసెంబర్ 5 వరకూ నియామకాలు చేపట్టరాదని ఆదేశం
న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం ప్రభుత్వాధికారులను 'రథ్ ప్రభారీలు'గా నియమించాలని భావిస్తున్న మోడీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండే నియోజకవర్గాల్లో డిసెంబర్ ఐదవ తేదీ వరకూ ఇలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. 'ప్రతిపాదిత వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కోసం సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారుల హోదాలో జిల్లా రథ్ ప్రభారీలుగా నియమించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు లేఖలు పంపినట్లు మా దృష్టికి వచ్చింది. ఛత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల కోసం కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. నాగాలాండ్ లోని తాపీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కూడా నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. కనుక అప్పటి వరకూ నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని కమిషన్ ఆదేశించింది' అని ఈసీ తన నోటీసులో తెలిపింది. అయితే కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ప్రకటించారు. సీనియర్ ప్రభుత్వాధికారులను 'రథ్ ప్రభారీలు'గా పిలవడం సరికాదని, అందుకే వారిని నోడల్ అధికారులుగా పిలుస్తామని వివరించారు.
వారు నోడల్ అధికారులంటూ కేంద్రం బుకాయింపు
దేశవ్యాప్తంగా కేంద్రం తలపెట్టిన వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కోసం ప్రభుత్వాధికారులను రథ్ ప్రభారీలుగా నియమించడంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. సీనియర్ అధికారులను రథ్ ప్రభారీలు అని పిలవడం సబబు కాదని, వారిని నోడల్ అధికారులుగా పిలుస్తామని తెలిపింది. ప్రభుత్వ విజయాల ప్రచారానికి సీనియర్ అధికారులను వినియోగించుకోవడంపై తొలుత కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం తరఫున రాజకీయ ప్రచారం చేయాలని అధికారులను ఎలా అడుగుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. వికసిత్ సంకల్ప యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 15న 'బిర్సా ముండా జయంతి-జన్ జాతి గౌరవ్ దివస్' సందర్భంగా ప్రారంభిస్తారు. జార్ఖండ్‌లోని కుంతీలో సమాచార, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) వాహనాలకు ఆయన పచ్చజెండా ఊపుతారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర స్పందిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నంత కాలం ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోమని తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. సంకల్ప యాత్రలో భాగంగా 2.6 లక్షల గ్రామ పంచాయతీలు, 3700 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రచారం నిర్వహిస్తారు. ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు క్షేత్ర స్థాయి నిపుణులు ఉంటారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కలుసుకొని, వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. వివిధ పథకాలలో లబ్దిదారులను చేర్చేందుకు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్లు కూడా చేస్తారు.