న్యూఢిల్లీ : పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యుఐడిఎఫ్) కింద దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కేటాయించిన పది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కేంద్ర బడ్జెట్‌లో ఈ నిధిని ప్రకటించిన విషయం తెలిసిందే. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధిని ఉద్దేశించారు. ఐదు కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల వరకూ ఖర్చయ్యే ప్రాజెక్టులకు ఈ నిధి నుంచి సాయం అందుతుందని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడిఎఫ్) తరహాలోనే యుఐడిఎఫ్‌కు బడ్జెట్‌లో ఏటా పది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు. దీని కింద ప్రస్తుతం 459 ద్వితీయ శ్రేణి, 580 తృతీయ శ్రేణి నగరాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఈ నిధిని అమలు చేసేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. లక్ష నుండి 99,99,999 వరకూ జనాభా ఉన్న నగరాలను ద్వితీయ శ్రేణి నగరాలుగా, యాభై వేల నుండి 99,999 వరకూ జనాభా కలిగిన నగరాలను తృతీయ శ్రేణి నగరాలుగా పరిగణిస్తారు. రుణ రూపంలో అందించే సాయంతో 11 రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడతారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందకపోవడంతో ప్రత్యేకించి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఈ నిధిని కేటాయించారు.