అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా, కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటుపరం కాకుండా అడ్డుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే సమర్థించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి పూనుకోవడం గర్హనీయం. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నది.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌ని నిన్న రాత్రి 12 గంటలకే గృహ నిర్బంధం చేశారు. విశాఖపట్నం, ఎన్‌టిఆర్, నెల్లూరు జిల్లాల్లో ప్రశాంతంగా ర్యాలీ చేస్తుండగా విద్యార్థులను అరెస్టు చేశారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలి.
విద్యార్థి సంఘాలు తమ సమస్యలపై కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు సంబందించిన సమస్యలపై ఆందోళన చేస్తున్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపడితే చదువుకున్న యువతకు ఉపాధి కల్పించబడుతుందని, రాష్ట్రానికి కేంద్రం చేసే ద్రోహానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలకడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజాకోర్టులో ప్రజలముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని సిపిఐ(యం) హెచ్చరిస్తున్నది అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.