Nov 22,2023 08:42
  • విభజన హామీలపై మారని కేంద్రం వైఖరి
  • హోంశాఖ సమావేశంలో విజ్ఞప్తులకే రాష్ట్రం పరిమితం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిలో ఏమాత్రం మార్పురాలేదు. విభజన హామీలపై మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలోనూ అదే ధోరణితో వ్యవహరించింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిర్వహించిన ఈ సమావేశంలోనైనా కేంద్రం సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. గతంలో మాదిరే మరోసారి విజ్ఞప్తులు చేయడానికి, వినతిపత్రాలు అందచేయడానికి రాష్ట్ర అధికారులు పరిమితమయ్యారు. ఈ సమావేశ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సుదీర్ఘంగా సమీక్షను నిర్వహించి, వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. వీటిని కూడా పూర్తిస్థాయిలో అధికారులు సమావేశంలో ప్రస్తావించలేకపోయారని సమాచారం. దీంతో కొన్ని అంశాలను రాతపూర్వకంగా అందచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు శ్రీలక్ష్మి, ప్రేమ చంద్రరెడ్డి, ఎస్‌ఎస్‌ రావత్‌, యువరాజు తదితరులు ఈ సమావేశం కోసమే న్యూఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే! అయినా, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించే అవకాశాన్ని కూడా కేంద్ర హోంశాఖ అధికారులు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరు భల్లా ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. సిఎం సూచనల మేరకు ప్రత్యేక హోదా అంశాన్ని అధికారులు మరోసారి ప్రస్తావించారు. విభజన కారణంగా ఆర్థికంగా జరిగిన నష్టాన్ని ఇప్పటికీ పూడ్చుకోలేకపోతున్నామని వివరించారు. పోలవరం నిధుల విడుదల జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలనీ కోరినట్లు సమావేశానంతరం రాష్ట్ర అధికారులు తెలిపారు. హైస్పీడు రైళ్లు, రోడ్డు విస్తరణ అంశాలపైనా లిఖితపూర్వక వినతిని సమర్పించినట్లు వివరించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన పోర్టులు, కడప స్టీలు ప్లాంటు మంజూరుపై తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఎక్కువ అప్పులు కేటాయించడం వల్ల ఆర్థికంగా నష్టపోయామని కేంద్రానికి తెలిపారు. అలాగే కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాల స్థాయిని పెంచాలని కోరామని పేర్కొన్నారు. కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రం నిధులు వెచ్చిస్తోందని, వాటిని ఇవ్వాలని, లేదా కేంద్రమే నిధులు చెల్లించాలని కోరామని పేర్కొన్నారు. విభజన జరిగి పదేళ్లు పూర్తవ్వొస్తున్న నేపథ్యంలో తెలంగాణాలో పెండింగ్‌లో ఉన్న ఐదువేల కోట్ల రూపాయల బిల్లులు ఇప్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. దీనికి హోంశాఖ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెప్పారు. అయితే, ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. వారిని ఆహ్వానించారా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. దీంతో తెలంగాణతో ముడిపడి ఉన్న అంశాలపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం ఉంటుందని భావిస్తున్నారు.