Nov 11,2023 11:09

హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పలుచోట్ల పార్టీ కార్యకర్తల మధ్య కొట్లాటలు, పోలీసుల లాఠీచార్జీలతో ఉద్రిక్తతలు నెలకొన్నా, మొత్తానికి ప్రశాంతంగా తొలి దశ ఘట్టం పూర్తయ్యింది. ఈనెల 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 15వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలుకు చివరి గడువు కావడంతో అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల లోపు రిటర్నింగ్‌ కార్యాలయాల ఆవరణలో ఉన్న అభ్యర్థులందరి నామినేషన్లను స్వీకరించారు. దీనితో కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి 7 గంటల తర్వాత కూడా నామినేషన్ల స్వీకరణ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన తుది సమాచారం రావడానికి మరింత సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ రాత్రి పది గంటల సమయంలో మీడియాకు తెలిపారు.
గజ్వేల్‌లోనే అత్యధికం...
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. 'ధరణి' వల్ల నష్టపోయిన ఇక్కడి రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. గురువారంనాటికే ఇక్కడ 43 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం మరికొందరు ఇదే కారణంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. .
పరువుపోద్దని...
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ మినహా అన్నిపార్టీల అధినేతలు పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీచేస్తుండగా, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో పాటు కామారెడ్డి నుంచీ పోటీచేస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచీ పోటీచేస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సిర్పూర్‌ స్థానం నుంచి బరిలో ఉన్నారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకడుగు వేశారు. ఆయన స్వంత నియోజకవర్గం అంబర్‌పేట నుంచి మాజీ మంత్రి, నకిలీ స్టాంప్‌పేపర్ల కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించి వచ్చిన సీ కృష్ణయాదవ్‌ను బరిలో నిలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందనే భయంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నట్టు సమాచారం.
426 కేసులు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులపై 426 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈ కేసులన్నింటిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామనీ, దోషులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన అనంతరం అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.538.23 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.