Jan 26,2023 22:03
  •  విభజన హామీలు సాధించుకునే వరకు పోరాటం
  • ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌
  • డపకు చేరుకున్న ప్రత్యేక హోదా సమరయాత్ర 2.0

ప్రజాశక్తి - కడప అర్బన్‌ : విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోందని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు. విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన 'ప్రత్యేక హోదా సాధన సమరయాత్ర 2.0' గురువారం కడపకు చేరుకుంది. మరియాపురం సెయింట్‌ జోసఫ్‌ జూనియర్‌ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో నేతలు సమావేశమయ్యారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఎపికి ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు ఇస్తానని తిరుపతి బహిరంగ సభలో ప్రధాని మోడీ చెప్పారన్నారు. హామీ ఇచ్చి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటినా ఇంతవరకు హామీల ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కోసం సమరయాత్ర చేపట్టామని తెలిపారు. రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం, పదవుల కోసం రాష్ట్ర, యువత ప్రయోజనాలు తాకట్టుపెడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఉందని మెకాన్‌ సంస్థ స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఉపాధిలేక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కుగా పోరాడతామని తెలిపారు. 11 కేంద్ర విశ్వవిద్యాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాలు కల్పించడకుండా ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. సెయిల్‌ ఆధ్వర్యాన కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షులు బి.నారాయణ మాట్లాడుతూ.. ఉక్కు పోరాటంలో విద్యార్థులు భాగస్వాములయ్యారని తెలిపారు. కేంద్రం మెడలు వంచైనా విభజన హామీలు సాధించుకుంటామని తెలిపారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు చిన్ని, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి వలరాజు, గంగాసురేష్‌, తదితరులు పాల్గొన్నారు.