Oct 17,2023 14:42
  • నాణ్యత లోపమే కారణం
  • అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం

ప్రజాశక్తి - ఎర్రగుంట్ల(కడప) : జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు బయట పడ్డాయి. నాణ్యతకు తిలోదకాలిచ్చి... నాశిరకంగా జాతీయ రహదారి పనులు చేసారని కళ్ళకు కట్టినట్లు గుంతలు దర్శనం ఇస్తున్నాయి. గుత్తే దారులు మాత్రం రోడ్డు నిర్మాణ పనులు బాగా చేసామని సంకలు గుద్దుకుంటున్నారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని ఐసిఎల్‌ కర్మాగారం నుంచి కడప రోడ్డులోని జువారి రైల్వే ట్రాక్‌ వరకు సుమారు 33 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ రోడ్డు పనులు పూర్తయి నెలలు మాత్రమే గడిచింది. అప్పుడే రోడ్లపై గుంతలు బయటపడ్డాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేనందువలనే గుంతలు పడుతున్నాయని పురజనం ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అధికారుల పర్యవేక్షణ లేనందువలనే సంబంధిత గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న రోడ్డులో సుమారు 6 అడుగులలోతు గుంత బయటపడింది. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా స్థానికులు ఎర్రటి వస్త్రాన్ని కర్రకు కట్టి గుంతపై ఉంచారు.గుంతల ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో స్పందించిన అధికారులు రోడ్డుపై ఏర్పడిన గుంతకు మంగళవారం మరమ్మత్తులు చేపట్టారు. అదేవిధంగా పోలీస్‌ స్టేషన్‌ కు కూతవేటు దూరంలోనే దెబ్బతిన్న రోడ్డుకు సుమారు రెండు నెలల క్రితం సంబంధిత అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ రోడ్డుపై గోతులు పడడం ప్యాచ్‌ వర్క్లు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఏళ్లకాలం ఉండాల్సినటువంటి జాతీయ రహదారి నెలల కాలంలోనే మరమ్మత్తులకు నోచుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలపై మరియు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని స్థానిక ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.