Oct 07,2023 18:31

ప్రజాశక్తి-కమలాపురం (కడప జిల్లా) : కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె రెవెన్యూ కార్యాలయంపై ఎసిబి అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి, విఆర్‌ఒ మునికృష్ణ పట్టుబడ్డారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎసిబి ఎఎస్‌పి దేవిప్రసాద్‌ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వీరపునాయునిపల్లె మండలం వెల్దుర్తికి చెందిన శేఖర్‌ అనే రైతు ఆరు ఎకరాల చుక్కల భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించుకోవడానికి 2012 నుండి తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. భూమి ఆన్‌లైన్‌ చేయాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని శేఖర్‌ ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎసిబి అధికారుల వ్యూహం మేరకు శేఖర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్‌, విఆర్‌ఒలను పట్టుకున్నారు. వారివురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో సిఐలు అలీ, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.