
- హైదరాబాద్‌లో పంపిణీకి సిద్ధంగా ఉన్న రూ.4 కోట్ల సామగ్రి స్వాధీనం
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ఎన్నికల వేళ పోలీసులు, ఐటి అధికారులు సోదాలు చేయడం సహజం. కానీ, కస్టమ్స్ ఏజెన్సీ దాడులు చేయడం అత్యంత అరుదు. తెలంగాణ ఎన్నికల్లో భారీగా నగదుతోపాటు తాయిలాలు పంపిణీ జరుగుతోందని పసిగట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అన్ని నిఘా ఏజెన్సీలను రంగంలోకి దింపింది. ఢిల్లీ నుంచి ఇసి అధికారులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. దీంతో, హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, ఐటి, ఇడి, డిఆర్‌ఐ, ఇతర నిఘా ఏజెన్సీలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే శనివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.4 కోట్ల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో బాలానగర్ సమీప ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు క్రీడా సామగ్రి, దుస్తులు, ఖరీదైన కిచెన్ పరికరాలు, బ్రాండెడ్ దుస్తులు, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకే సామగ్రిని స్టాక్ చేసినట్లు తెలిసిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిలో విదేశీ బ్రాండెడ్ వస్తువులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, సామగ్రి స్టాక్ చేసిన భవనాలు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులకు చెందినవిగా ప్రచారం జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అనధికారికంగా తరలిస్తున్న రూ.6.68 కోట్ల నగదు, రూ.3.25 కోట్ల విలువైన లిక్కర్, రూ.25 లక్షలు విలువైన గంజాయి, రూ.10 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఇఒ కార్యాలయం శనివారం తెలిపింది.