
- ఎసిబి అధికారులకు పట్టుబడ్డ సర్వేయర్
ప్రజాశక్తి - కనిగిరి : భూమిని సబ్‌డివిజన్ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం సర్వేయర్ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్‌పి వి.శ్రీనివాసరావు వివరాల మేరకు...కనిగిరి మండలం వంగపాడుకు చెందిన కాకర్ల శ్రీనివాసు, ఆయన ఇద్దరు సోదరులకు తమ తండ్రి నుంచి 2.42 ఎకరాల భూమి సంక్రమించింది. ఆ భూమిని సబ్ డివిజన్ చేసుకునేందుకు ఈనెల 11న మండల పరిధిలోని గురువాజిపేట సచివాలయంలో దరఖాస్తు చేశారు. అనంతరం సర్వేయర్ అల్లం రంగస్వామి కలిశారు. భూమిని సబ్‌డివిజన్ చేసేందుకు సర్వేయర్ రూ.60 వేలు లంచం డిమాండ్ చేశారు. ముందుగా రూ.30 వేలు, సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు మరో రూ.20 వేలు ఇచ్చేలా వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో సర్వేయర్‌కు లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాసులు.. ఎసిబి అధికారులను సంప్రదించారు. వారి ఆదేశాల మేరకు తహశీల్దారు కార్యాలయంలో సర్వేయర్‌కు రూ.30 వేలు ఇచ్చారు. అప్పటికే తహశీల్దారు కార్యాలయం ఉన్న ఎసిబి అధికారులు సర్వేయర్‌ను పట్టుకున్నారు. రంగస్వామిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఎసిబి కోర్టులో శనివారం హాజరుపరచనున్నట్లు ఎసిబి డిఎస్‌పి తెలిపారు.