ప్రజాశక్తి-గుంటూరు : వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ చేయించటానికి అవసరమైన ఆపరేషన్ థియేటర్‌ను వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. శుక్రవారం వీధి కుక్కలకు సంబంధించి యాంటి బర్త్ కంట్రోల్, యాంటి రాబిస్ వ్యాక్సిన్ మానిటరింగ్ కమిటీ సమావేశం కమిషనర్ చాంబర్‌లో నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వీధి కుక్కలకు సంబంధించి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని, ఇందుకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకూ ఏటుకూరు రోడ్డులో స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ చేయించేవారమని, అయితే ప్రభుత్వ పశు వైద్యశాల వారి సూచనల మేరకు అధునాతన ఆపరేషన్ థియేటర్, సౌకర్యాలతో నగరానికి వెలుపల నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కుక్కలను పట్టేందుకు జిఎంసి నుంచి ఓ పర్యవేక్షణ సిబ్బందిని నియమిస్తామని, వారు వీధి నుంచి కుక్కలను తీసుకురావడం, వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ చేయించి సదరు ప్రాంతంలోనే వదిలేలా పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ పి.నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాస రావు, బి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, ఎంహెచ్‌ఒ వెంకటరమణ, ప్రభుత్వ పశువైద్యశాల ఎడి అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్, ఎస్‌ఎస్‌లు, ఎన్‌జిఒల ప్రతినిధులు పాల్గొన్నారు.