ప్రతి యేడాది ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకర వాతావరణంలో విద్యాలయాలు ప్రారంభమయ్యేవి. పాఠశాల ప్రాంగణాల్లో యూనిఫారం ధరించిన విద్యార్థులు రంగురంగుల సీతాకోకచిలుకల్లా, విజ్ఞాన దివిటీల్లా సంచరిస్తుండేవారు. 'గరికపచ్చ మైదానాల్లోనూ/ తామరపూవుల కోనేరులలో/ పంటచేలలో, బొమ్మరిళ్లలో/...ఎక్కడ చూస్తే అక్కడ మీరై/ విశ్వరూపమున విహరిస్తుండే/ పరమాత్మలు/ ఓ చిరుతల్లారా!' అంటాడు మహాకవి శ్రీశ్రీ పిల్లల నుద్దేశించి. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం ఒక్కసారిగా మటుమాయమైంది. కరోనా భయంతో విద్యాలయాలు బోసిపోయి మౌనముద్రను దాల్చాయి. భీతావాహంతో బిక్కుబిక్కుమంటున్నాయి. పిల్లలు రోడ్డుపైకి రావాలంటేనే భయంతో వణికిపోవాల్సి వస్తోంది. ఆ భయానక స్థితి నుంచి కొంత కోలుకొని ఒక్క అడుగు అయినా ముందుకు వేయక తప్పని పరిస్థితి. ప్రస్తుతం కరోనా ఉధృతి కొంత తగ్గుముఖం పడుతుండటం, దానిపట్ల కొంత అవగాహన ఏర్పడిన దరిమిలా రేపటి నుంచి విద్యాలయాలు పున:ప్రారంభం అవుతున్నాయి.
వాస్తవానికి, ఐదు నెలల క్రితమే విద్యాలయాలు ప్రారంభం కావాల్సివుంది. అప్పటి నుంచి సిలబస్ ప్రారంభిస్తేనే వార్షిక పరీక్షలు నాటికి సిలబస్ పూర్తయ్యేది. కానీ, ఒక విద్యా సంవత్సరంలో విలువైన ఐదునెలల కాలం అప్పుడే గడిచిపోయింది. ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినా... ఆలస్యంగా ప్రారంభించడం, ఎక్కువమంది తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడంతో మందకొడిగా సాగాయి. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ చదువులను నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఆన్‌లైన్ విద్య వైపే మొగ్గు చూపుతున్న కేంద్ర ప్రభుత్వం... విద్యను ఆన్‌లైన్ వ్యాపారంగా చూస్తోంది. దేశంలో లక్ష కోట్ల మేర ఆన్‌లైన్ విద్య వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు మరి. ఈ వ్యాపారీకరణలో విద్యార్థుల మానసిక స్థితిని ఇటు ప్రభుత్వంగానీ, అటు విద్యాసంస్థలుగానీ పట్టించుకోవడం మానేశాయి. ఇంకోవైపు వీడియో పాఠాలు వినే సమయంలో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. దీనికితోడు విద్యార్థులకు ఇళ్ల వద్ద ఉండే వాతావరణం, కరెంట్ కోతలు, ఆన్‌లైన్ విద్యకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఇంటర్నెట్ కొరత ఆటంకాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను ప్రారంభించేసి, మిగిలిన ఐదు నెలల కాలంలోనే సిలబస్ నంతా నేర్పేయాలనుకోవడం వల్ల విద్యార్థులపై మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది.
విద్యాభ్యాసం అంటే... విద్యను గురువు దగ్గర అభ్యసించడం. అది గురువు...విద్యార్థి ముఖాముఖి వల్లే సాధ్యపడుతుంది. విద్యార్థి తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని విజ్ఞానాన్ని బుర్రలోకి ఎక్కించుకోవాలంటే గురువు సాన్నిధ్యంలోనే విద్యను అభ్యసించాలి. ఆన్‌లైన్ విద్య దీనికి ప్రత్యామ్నాయం కాదు. అయితే, కరోనా అననుకూల పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ముందే మేల్కొని వుండాల్సింది. ఆన్‌లైన్ విద్యకు అవసరమైన సాంకేతిక పరికరాలను, ఇంటర్నెట్ సదుపాయాన్ని సమకూర్చి వుంటే కొంతవరకైనా సిలబస్ పూర్తయ్యేది. పిల్లలపై చాలావరకు ఒత్తిడి తగ్గివుండేది. కానీ, ప్రస్తుతం కరోనా నిబంధనలను పాటిస్తూ సిలబస్ అంతా తక్కువ సమయంలోనే నేర్పించేయాలనుకోవడం భ్రమే అవుతుంది. ఈ రకమైన బోధన వచ్చే ఏడాది పైతరగతి సిలబస్‌ను అందిపుచ్చుకోడానికి ఎంతమాత్రం ఉపయోగపడదు. కేరళలో నాలుగు నెలల ముందుగానే ఆన్‌లైన్ విద్యకు అవసరమైన సాంకేతిక సదుపాయాలన్నీ ప్రభుత్వమే సమకూర్చింది. ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట్ల కూడా నెట్ సదుపాయం కల్పించి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో దాదాపు 90 శాతం మందికి ఆన్‌లైన్ విద్యను అందిస్తోంది. ఆ రకమైన ముందుచూపు మన రాష్ట్ర ప్రభుత్వానికి కొరవడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేస్తున్నాం అని చేతులు దులిపేసుకోకుండా...విద్యార్థులపై ఒత్తిడి పెరగకుండా, వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరం కోవిడ్ చేతిలో వుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా పిల్లల్లో సామర్థ్యం, మానసిక స్థైర్యం కల్పించాలి. దీనికి ప్రభుత్వం మరింత చొరవ చూపాలి. 'మీదే, మీదే సమస్త విశ్వం/ మీరే లోకపు భాగ్యవిధాతలు/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు' అంటూ భవితకు బాటలు వేయాలి.










